శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 22, 2020 , 05:00:32

స్వేచ్ఛగా ఓటు వేయాలి

స్వేచ్ఛగా ఓటు వేయాలి
  • -ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
  • -పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 144సెక్షన్‌
  • -ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
  • -డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల పరిశీలనలో కలెక్టర్‌ శరత్‌

జగిత్యాల/ధర్మపురి,నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్ని పనులున్నా ఒకరోజు వాయిదా వేసుకొని ఓటుహక్కును వినియోంచుకోవాలని కలెక్టర్‌ శరత్‌ పిలుపునిచ్చారు. జగిత్యాల మినీస్టేడియం, ధర్మపురిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను మంగళవారం పరిశీలించిన అనంతరం మాట్లాడారు. బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, జిల్లాలో మొత్తం 134వార్డులకు గాను, నాలుగు ఏకగ్రీవమయ్యాయని, 130వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. 285 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 55 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గానూ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌, వీడియో కెమెరాలు, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో 144సెక్షన్‌ అమల్లో ఉందని తెలిపారు. ఓటరుల ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటరుగా ఎలా నమోదు చేసుకున్నారో అదే స్ఫూర్తితో ఓటు వేయాలన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకున్న జిల్లాగా పేరు రావాలన్నారు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. మహిళా ఉద్యోగులకు పోలింగ్‌ కేంద్రాల్లో  ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో దివ్యాంగ ఓటర్లను గుర్తించామని, వారిని ఇంటి నుంచి తీసుకొని వచ్చి క్యూలైన్లు లేకుండా వీల్‌చైర్‌లలో నేరుగా ఓటు వేయించి మళ్లీ ఇంటికి చేర్చే సౌకర్యం కల్పించామని చెప్పారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో నరేందర్‌, జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ లచ్చిరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్‌, ఎన్నికల సహాయ అధికారి దివ్యదర్శన్‌రావు, ధర్మపురి ఎంపీవో మేరుగు శ్రీధర్‌, డీటీ సుమన్‌ తదితరులున్నారు.  
logo