బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 21, 2020 , 01:31:12

ఆఖరి రోజు అదే జోరు

ఆఖరి రోజు అదే జోరు
  • -హోరెత్తించిన టీఆర్‌ఎస్‌ సేన
  • -ఇంటింటికీ తిరిగిన అభ్యర్థులు
  • -అభివృద్ధి, పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన
  • -అన్ని మున్సిపాలిటీల్లో రోడ్‌ షోలు
  • - ధర్మపురిలో ఎంపీ వెంకటేశ్‌నేతకానితో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రచారం
  • - జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత
  • - మెట్‌పల్లి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
  • -కారు గుర్తుకే ఓటేయాలని పిలుపు
  • -ముగిసిన ప్రచార పర్వం


ష్‌.. గప్‌చుప్‌! మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకుల మోత బంద్‌ అయింది. ఈ నెల 15 నుంచి జోరుగా సాగిన ప్రచారం, ఆఖరి రోజూ హోరెత్తింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూసుకెళ్లింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌లో అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి, అభివృద్ధి, పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వీరికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వేలాది మందితో రోడ్‌ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించారు. ధర్మపురిలో ఎంపీ వెంకటేశ్‌నేతకానితో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రచారం నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, మెట్‌పల్లి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

జగిత్యాల బృందం, నమస్తే తెలంగాణ : జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో సోమవారంతో ప్రచారం ముగిసింది. ఆఖరి రోజు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ సత్తా చాటారు. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంత్రి ఈశ్వర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పలు వార్డుల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మెట్‌పల్లి ఎమ్మెల్యే సతీమణి సరోజ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత అభ్యర్థులతో కలిసి పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. రాయికల్‌లో అభ్యర్థులు గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకే ఓటేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నాయకులు, అనుచరులు, అభిమానులతో వార్డుల్లో ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.logo
>>>>>>