మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jagityal - Jan 19, 2020 , 00:03:44

సబ్బండ వర్గాలకు సర్కారు పథకాలు

సబ్బండ వర్గాలకు సర్కారు పథకాలు


(జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి,నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్‌): రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సర్కారు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌తో కలిసి మెట్‌పల్లి, జగిత్యాలలో మంత్రి ఈశ్వర్‌ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రచారం చేశారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాట్లాడుతూ  ప్రజాభీష్టం మేరకు జగిత్యాలను జిల్లా కేంద్రంగా మలిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనన్నారు.

మాజీ ఎంపీ కవిత చొరవతో జగిత్యాల అభివృద్ధి కోసం రూ.50కోట్ల నిధులు కేటాయించారని, దీంతో పట్టణ రూపురేఖలు మారుత్నుయని చెప్పారు. గతంలో జీవన్‌రెడ్డి మంత్రిగా ఉండి జగిత్యాల అభివృద్ధిని కాంక్షించలేదని, జగిత్యాల మున్సిపాలిటీని అవినీతికి మారుపేరులా నిలిపారని విమర్శించారు. జేఎన్‌టీయూను ఏర్పాటు చేశామని  చెబుతున్న జీవన్‌రెడ్డి, కొండగట్టు గుట్టల్లో దాన్ని ఏర్పాటు చేయడంలో రహస్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు వ్యాపార ధోరణి తప్ప, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే లేదన్నారు. ప్రశ్నించే గొంతును కాదని, అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన 5 రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చారని, దానికి అతీగతీ లేదన్నారు. ఎంపీగా కవిత ఉన్న సమయంలో నిజామాబాద్‌ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో నెలకు కనీసం మూడు సార్లు పర్యటించారని, సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు.

బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణే అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రజలకు ఏం చేస్తుందో ఇప్పటికీ చెప్పలేదన్నారు. జగిత్యాలలో 48వార్డులంటే వాటిలో 11 మంది అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని దుస్థితి బీజేపీదన్నారు. ఇనేళ్లలో జగిత్యాల అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్‌, మున్సిపల్‌ ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ చారిత్రక విశిష్టత ఉన్న జగిత్యాల పట్టణం కాంగ్రెస్‌ పాలనలో వెనుకబడి పోయిందని, కోట్లాది నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎంపీ కవితకే దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పాలనకు జగిత్యాల ప్రజలు చరమగీతం పాడడం, జగిత్యాల బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇక్కడ సమావేశంలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, దావ సురేశ్‌, గట్టు సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్ని మున్సిపాలిటీలపై గులాబీజెండా

అన్ని మున్సిపాలిటీలపై గులాబీజెండా ఎగరడం ఖాయమని మంత్రి ఈశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. మెట్‌పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు.  జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల అభివృద్ధికి రూ. 50 కోట్లు చొప్పున కేటాయించామని, అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయంలో ఆదర్శంగా ఉన్న జగిత్యాల జిల్లాపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి ఉందని, అభివృద్ధిలోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు  అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.  ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేశారని, ఈ రెండు పట్టణాలు మరింత హంగులతో రూపుదిద్దుకోవాలంటే అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజా క్షేత్రంలో బీజేపీకి  క్యాడర్‌ లేదని, ఓట్లు లేవని, పసుపు బోర్డు పేరిట రైతులను మభ్యపెట్టి అబద్ధాలతో ఓట్లు దండుకుని గెలిచిన ఈ ప్రాంత ఎంపీ అర్వింద్‌ అడ్రస్‌ లేదని, ఆయన ప్రజలకు మొహం చూపే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ రాజకీయ నీతి, చాణక్యం కలగలిసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని, రాష్ట్రం ఏర్పడ్డాక  స్వపరిపాలన, వికేంద్రీకరణతో ప్రజల ముగింటకు పాలనను తీసుకెళ్లాలనే సంకల్పంతో కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లాలను  ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.   ఎంపీగా కల్వకుంట్ల కవిత  కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కోరుట్లలో 3, మెట్‌పల్లిలో 2 చొప్పున వార్డులు ఏకగ్రీవం కావడం అభినందనీయమని, మిగతా స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ను గెలిపించి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రతిష్టను  సీఎం కేసీఆర్‌ వద్ద మరింత పెంచాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, నాయకులు వెంకట్‌రెడ్డి, అశోక్‌, డా. సత్యనారాయణ, మాడిశెట్టి ప్రభాకర్‌, ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఏలేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలి

 జగిత్యాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలని మంత్రి ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని 11, 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బాలె లత, మేకల పవన్‌కు మద్దతుగా మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ రాబోయే కాలంలో జగిత్యాల మున్సిపాలిటీలో నాలుగు వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందని, నిరుపేదలకు వీటిని అందిస్తామన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నాయకులు బాలె శంకర్‌, అల్లాల దామోదర్‌ రావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఊహకందని అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఊహకందని రీతిలో అభివృద్ధి సాధించిందని  మంత్రి ఈశ్వర్‌ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం సమీపంలో ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ స్వరాష్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాపాలనకు అద్దం పట్టే రీతిలో పసిపాప నుంచి పండు ముసలి వరకు లబ్ధి పొందేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నరన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్‌ వంటి నాయకుడిని మళ్లీ మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మనదేనని, గత జడ్పీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 33 జడ్పీల్లో 32 జడ్పీలను కైవసం చేసుకున్నామని, ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్‌, పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్‌ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌ పాల్గొన్నారు. కోరుట్ల పర్యటనకు వచ్చిన మంత్రి ఈశ్వర్‌, ఇంటి బయట కూర్చున్న వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరించారు. ‘పింఛను అందుతుందా తల్లీ” అంటూ వాకబు చేశారు. నీకు పింఛను ఎవరిస్తున్నారని అడగగా, ‘నా పెద్ద కొడుకు కేసీఆర్‌ ఇస్తున్నడు’ అంటూ వృద్ధురాలు గట్టిగా చెప్పడంతో మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
 

సంక్షేమం, అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే..

 సంక్షేమం, అభివృద్ది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని  మంత్రి ఈశ్వర్‌ పేర్కొన్నారు. ధర్మపురిలోని 1,9,10,7,5 వార్డులో ఆయన విస్తృత ప్రచారం చేశారు.  వార్డుల్లోని ప్రధాన వీధుల్లో ర్యాలీ తీశారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. రూ.100కోట్లతో ధర్మపురి క్షేత్రాన్ని టెంపుల్‌సిటీగా అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ధర్మపురి మున్సిపాలిటీని రూ.35కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ధర్మపురి ప్రజలు టీఆర్‌ఎస్‌ కారు గుర్తు పైనే ఓటువేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల  చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రాజేశ్‌కుమార్‌, దేవస్థానం మాజీ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, నాయకులు సంగి శేఖర్‌, అక్కనపల్లి సునీల్‌, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు తదితరులున్నారు.


logo