గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 18, 2020 , 04:21:58

ప్రచారణం

ప్రచారణం
  • -పట్టణాల్లో హోరెత్తుతున్న ‘పుర’ ప్రచారం
  • - దూకుడు పెంచిన టీఆర్‌ఎస్‌
  • -వాడవాడనా గులాబీ సేన జోరు
  • - ఇంటింటికీ వెళ్తున్న అభ్యర్థులు
  • -అభివృద్ధి, పథకాలను వివరిస్తూ ముందుకు..
  • - మద్దతుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
  • -జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌
  • - కోరుట్ల, మెట్‌పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
  • -రాయికల్‌లో జడ్పీ అధ్యక్షురాలు వసంత

జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి,నమస్తే తెలంగాణ/ రాయికల్‌/ కోరుట్లటౌన్‌ : జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికీ వెళ్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో అగ్రనేతలు తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2,3,4,5,19 వార్డుల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. 2వ వార్డులో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. నాలుగు వార్డుల ఓటర్లతో కలిసి జంబిగద్దె వద్ద  రోడ్‌ షో నిర్వహించారు. జగిత్యాల పట్టణ వాసులు తాగు నీటి కోసం ఎన్నో కష్టాలు అనుభవించారని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ భగీరథ ద్వారా జగిత్యాల పట్టణంలో ఇంటింటికీ నల్లా నీరందించి నీటి కరువును తొలగించామన్నారు. జగిత్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక శాతం టికెట్లు బీసీలకు కేటాయించామని, రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాయికల్‌  మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల అభ్యర్థులకు మద్దతుగా జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేశారు.

స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కూడళ్లలో మహిళలతో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మెట్‌పల్లి పట్టణంలోని 1,2,7,8,9,10,18 వార్డుల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విస్త్రృత ప్రచారం చేశారు. వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని ఓటర్లను కోరారు. కోరుట్ల పట్టణంలోని 9, 20, 24, 27 వార్డుల్లోనూ ఎమ్మెల్యే కల్వకుంట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, పట్టణాలను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో ధర్మపురితో పాటు పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.  పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలతో ఉత్సాహంగా ముందుకు సాగారు.logo
>>>>>>