మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 13, 2020 , 02:38:04

పలెల్లో ప్రగతి సంబురం

పలెల్లో ప్రగతి సంబురం
  • - పదిరోజుల కార్యక్రమం విజయవంతం
  • - చివరిరోజు వేడుకలతో ముగింపు
  • - అన్ని గ్రామాల్లో సభలు
  • - పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగిస్తామని ప్రతిజ్ఞలు
  • - పంచాయతీల్లో బెలూన్ల ప్రదర్శనలు
  • - అంతటా ర్యాలీలు
  • - ఆకట్టుకున్న రంగవల్లుల పోటీలు
  • - విజేతలకు బహుమతుల ప్రదానం

 జగిత్యాల బృందం, నమస్తే తెలంగాణ :  ఈ నెల 2న ప్రారంభమైన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది. అన్ని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు గ్రామాల్లో పాదయాత్రలు చేసి సమస్యలు గుర్తించారు. అదే రోజు గ్రామసభల్లో పరిష్కారానికి ప్రణాళికలు వేసుకున్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక, కంపోస్టు ఎరువుల తయారీ షెడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి గ్రామంలోని నర్సరీల పరిస్థితిని సమీక్షించారు. మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున నాటారు. పలు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ప్రతి రోజూ చేపట్టారు. మహిళలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానాలు చేశారు. వీధులు, మురికి కాలువలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్‌ నిషేధంపై ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ, పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా మార్చారు. ఈ విడతలో వచ్చిన రెండు శుక్రవారాల్లో ‘ఫ్రైడే- డ్రైడే’ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణ చేపట్టారు. పలు గ్రామాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్‌ శరత్‌, జేసీ రాజేశం పరిశీలించి ఎప్పటికప్పుడు గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపారు. పలు సందర్భాల్లో ఫ్లయింగ్‌ స్వాడ్‌ బృందం, ప్రత్యేకాధికారులు వచ్చి పనులకు తనిఖీ చేశారు.

ఆఖరి రోజు గ్రామ సభలు.. వేడుకలు
ఆఖరి రోజు ఆదివారం అన్ని గ్రామాల్లో సభలు ని ర్వహించారు. పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించుకున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, ఉత్తమ ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. బెలూన్లతో ప్రదర్శన, ర్యాలీలు తీశారు. పారిశుధ్య పనులు నిరంతరం కొనగిస్తామని ప్రతిజ్ఙ చేశారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సైతం నిర్వహించి పంచాయతీల ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. అభివృద్ధి పనులకు విరాళాలు అందించినవారిని ఘనంగా సన్మానించారు. కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంరక్షణకు జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. కలిసికట్టుగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముగించుకున్నారు. 


logo
>>>>>>