సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 12, 2020 , 04:58:30

పచ్చదనం, పారిశుధ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పచ్చదనం, పారిశుధ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి


పెగడపల్లి:  పచ్చదనం, పారిశుధ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ శరత్‌ సూచిం చారు. శనివారం మండలంలోని ఏడుమోటలపల్లి గ్రామంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జగిత్యాల ఆర్డీఓ డాక్టర్‌ గంటా నరేందర్‌తో కలిసి పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెగడపల్లి మండల కేంద్రం సమీపం నుంచి ఏడుమోటపల్లి గ్రామం వరకు కాలినడకన రెండు కిలోమీటర్ల మేర కలెక్టర్‌ కాలినడకన పర్యటించారు. రోడ్ల కిరువైపుల నాటిన మొక్కలు, మురుగు కాల్వలు, పలు వీధులను పరిశీలించడంతో పా టు, నివాస గృహాల్లోని తడి, పొడి చెత్త బుట్టలను పరిశీలించారు. గ్రామంలోని కంటం మల్లమ్మ అనే వృద్ధురాలు ఇంటి వద్ద ఆగిన కలెక్టర్‌ ఆ ఇంటి వద్ద ఉన్న చెట్లను చూసి, ఆనందం వ్యక్తం చేస్తూ, ఆ మహిళను అభినందిస్తూ, అందరు తమ ఇండ్ల వద్ద ఇలా చెట్లు పెంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళి, పల్లె ప్రగతి పనులను పంచాయతీ పాలక వర్గాలు నిరంతరం కొనసాగించాలనీ, గ్రామాల అభివృద్ధికి దాతలు సహకరించాలన్నారు.  ముఖ్యంగా గ్రామాల్లో పాఠశాలలకు రంగులు వే సేందుకు దాతలు సహకరించడంతో పాటు, దోమల నివారణకు ఫాగింగ్‌ మిషన్లు, అలాగే అనుకోకుండా ఎవరైనా మృతి చెందితే కుటుంబ సభ్యులు వచ్చే వరకు మృత దేహాన్ని భద్ర పరిచేందకు బాడీ ఫ్రీజర్‌ కొనుగోలుకు దాతలు సహకరించాలన్నారు.

ప్రతి గ్రామంలో నర్సరీ తప్పని సరిగా ఏర్పాటు చేయడంతో పాటు, ఆ గ్రామానికి అవసరమైన మొక్కలు సర్వే చేసి, అందులో పెంచాలని, అలాగే వైకుంఠధామాల నిర్మాణంతో పాటు డంపింగ్‌ యార్డుల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి రూ.2లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించగా, ఎంపీటీసీ మం దపల్లి అంజయ్య ఫాగింగ్‌ మిషన్‌ కొనుగోలు చేసి ఇస్తానని ప్రకటించారు. అలాగే గ్రామానికి చెందిన ఆకుల విష్ణు, మ్యాక లింగరెడ్డి, ఎడ్ల తిరుపతిరెడ్డి, చిలువేరు లచ్చయ్య బాడీ ఫ్రీజర్‌ కొనుగోలుకు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడంతో కలెక్టర్‌ వారిని సన్మానించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, తాసిల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీఓ వాసాల వెంకటే శం, మండల పంచాయతీ అధికారి భీమ జయశీల, డీటీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ జమున, ఈజీఎస్‌ ఏపీఓ వేణు, సర్పంచ్‌ రవినాయక్‌, ఎంపీటీసీ మందపల్లి అంజయ్య, కో-ఆప్షన్‌ సభ్యుడు రహీంనాయకులు గోలి సురేందర్‌రెడ్డి, తోట మోహన్‌రెడ్డి, ఐలేని సాగర్‌రావు, చిరంజీవినాయక్‌, భోగ లక్ష్మీనారాయణ, తిరుపతినాయక్‌ ఉన్నారు.

 జడ్పీ పాఠశాలకు రూ.20 వేల విరాళం..

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలకు పునరుత్తేజం పథకంలో భాగంగా రూ.20 వేల విరాళాన్ని ప్రకటించిన జడ్పీటీసీ సభ్యుడు కాసుగంటి రాజేందర్‌రావు శనివారం కలెక్టర్‌ శరత్‌కు చెక్కును అందజేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలానికి వచ్చిన కలెక్టర్‌కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జడ్పీటీసీ సభ్యుడిని అభినందించారు.   ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోళి శోభ,  వైస్‌ ఎంపీపీ గాజు ల గంగాధర్‌, తాసిల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీఓ వాసాల వెంకటేశం, ఈజీఎస్‌ ఏపీఓ వేణు, ఉప సర్పంచ్‌ ఐలేని సాగర్‌రావు,  కో-ఆప్షన్‌ సభ్యుడు రహీం, నాయకులు గోలి సురేందర్‌రెడ్డి, తోట మోహన్‌రెడ్డి, చిరంజీవినాయక్‌, భోగ లక్ష్మీనారాయణ, తిరుపతినాయక్‌ ఉన్నారు.గొల్లపల్లి :  మండలంలోని వెనుగుమట్ల గ్రామం లో శనివారం కలెక్టర్‌ పల్లె ప్రగతి పనులను  పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామంలో పల్లెప్రగతి పనులపై ఆరాతీశారు.      సర్పంచ్‌కు, ప్రజలకు పలు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో నరేందర్‌ ఉన్నారు.


logo