శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 08, 2020 , 12:07:18

పుర పోరుకు మూడోసారి

పుర పోరుకు మూడోసారి
  • jagityal news

మెట్‌పల్లి, నమసే ్తతెలంగాణ : మేజర్ పంచాయతీ నుంచి ఫురపాలక సంఘంగా రూపాంతరం చెందిన మెట్‌పల్లి, ముచ్చటగా మూడో సారి బల్దియా పాలకవర్గ ఎన్నికలకు సిద్ధమైంది. 2004 డిసెంబర్ 4న, 24 వార్డులతో పురపాలక సంఘంగా ఏర్పడగా అప్పటి నుంచి రెండు పాలకవర్గాలు పని చేశాయి. మొదటి పాలకవర్గంలో ఐదేళ్ల కాలంలో ముగ్గురు అధ్యక్షులు, ముగ్గురు ఉపాధ్యక్షులుగా పని చేయడం గమనార్హం. తొలి సారి 2005లో జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ అధ్యక్ష స్థానం రిజర్వేషన్లలో భాగంగా బీసీ మహిళకు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకోగా ఆ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన ఎర్రోళ్ల నర్సు మున్సిపల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పదవీ కాలం ఐదేళ్లు ఉన్నా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అధికార పక్షం సభ్యుల మధ్య కాల పరిమితితో కూడిన షరతులు విధించుకున్నారు. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవీ కాలాన్ని తలా కొంత కాలం పాటు చేపట్టారు. తొలి అధ్యక్షురాలిగా ఎర్రోళ్ల నర్సు 2005 నవంబర్ 9 నుంచి మార్చి 29, 2007వరకు, ధర్మపురి నాగరాణి 2007 మార్చి 30 నుంచి మే 20,2009 వరకు, ఏశాల సుశీల 2009 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 19, 2010 వరకు పని చేశారు. అదే విధంగా మున్సిపల్ ఉపాధ్యక్షులుగా యామ రాజయ్య, బత్తుల లక్ష్మణ్, వన్నెల గంగారాం కూడా అదే తరహాలో తమ పదవీ కాలాన్ని పూర్తి చేశారు. పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో 2010 నుంచి 2014 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2014 మేలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధ్యక్ష స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెజార్టీ కౌన్సిల్ స్థానాలు గెలుచుకొని బల్దియాపై గులాబీ జెండా ఎగరేసింది. పదో వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన మర్రి ఉమారాణి అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షుడిగా 18వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన మార్గం గంగాధర్ బాధ్యతలు చేపట్టారు.


నాలుగేండ్ల తర్వాత ఉపాధ్యక్షుడిపై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో గంగాధర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపాధ్యక్షుడిగా 15వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న మైలారపు లింబాద్రి ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల జాప్యం నేపథ్యంలో ప్రత్యేకాధికారిగా స్థానిక సబ్ కలెక్టర్ గౌతమ్ పొత్రు కొనసాగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయడంతో తాజాగా మూడో పర్యాయం ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డుల పునర్విభజనలో భాగంగా 24 వార్డుల నుంచి 26 వార్డులు పెరిగాయి. పట్టణానికి సమీపంలోని ఆరపేట, వెంకట్రావుపేట గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య పెరగడంతో వార్డుల సంఖ్య సైతం గతంలో ఉన్న వార్డులకు అదనంగా మరో రెండు పెరిగాయి. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పట్టణంలో మొత్తం ఓటర్లు 40,636 ఉండగా అందులో 20764 మంది మహిళలు, 19871 మంది పురుషులున్నారు.


logo