లూసియానా: అమెరికాలోని స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో.. ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన టీనేజ్ అమ్మాయి జైలా అవంటా గార్డె విజేతగా నిలిచింది. 14 ఏళ్ల బాలిక జైలా murraya అనే పదాన్ని తప్పులు లేకుండా చెప్పి కాంపిటీషన్ గెలుచుకున్నది. murraya ఆస్ట్రేలియా జాతికి చెందని ఓ వృక్షం. querimonious, solidungulate లాంటి కఠినమైన పదాలను కూడా పలికిందామె. ప్రతి రోజు ఏడు గంటల పాటు జైలా స్పెల్లింగ్ ప్రాక్టీసు చేసిందట. ఓ అలవాటుగా ఆమె పదాలను నేర్చుకున్నది. స్పెల్లింగ్ బీ గెలిచినా.. తన ఫోకస్ అంతా బాస్కెట్బాల్పైనే ఉన్నట్లు ఆమె చెప్పింది. ఒకేసారి బంతుల్ని డ్రిబ్లింగ్ చేయడంలో ఇప్పటికే ఆమె ఖాతాలో మూడు వరల్డ్ రికార్డులు ఉన్నాయి.
ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరిగిన ఫైనల్లో మొత్తం 11 మంది పోటీపడ్డారు. ఫస్ట్ ప్రైజ్ కింద 50 వేల డాలర్లు ఇస్తారు. ఫైనల్ రౌండ్లో ఆమె 12 ఏళ్ల భారతీయ సంతతి బాలిక చైత్ర తుమ్మపై విజయం సాధించింది. నిజానికి ఫైనలిస్టుల్లో 9 మంది భారతీయ సంతతి విద్యార్థులు ఉన్నా.. కాంపిటీషన్లో జైలా గెలుపొందడం విశేషం. న్యూయార్క్‌కు చెందని 13 ఏళ్ల భావన మదిని మూడవ స్థానంలో నిలిచింది.