గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 01:35:00

యువత ద్వారా కరోనా వ్యాప్తి

యువత ద్వారా కరోనా వ్యాప్తి

  •  కరోనా తాజా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో 
  •  వ్యాక్సిన్‌ నేషనలిజం తగదని వ్యాఖ్య
  •  టీకాపై అంతర్జాతీయ ఒప్పందానికి దేశాలు ముందుకురావాలని పిలుపు

జెనీవా, ఆగస్టు 18: కరోనా మహమ్మారి మార్పు చెందుతున్నదని, ప్రస్తుతం యువత ద్వారానే వైరస్‌ వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 20-40 ఏండ్ల వారి ద్వారా వైరస్‌ ప్రబలుతున్నదని డబ్ల్యూహెచ్‌వో పశ్చిమ పసిఫిక్‌ రీజినల్‌ డైరెక్టర్‌ తకేశి కషాయ్‌ అన్నారు. తమకు వైరస్‌ సోకినట్లు చాలా మందికి తెలియడం లేదని, వారి ద్వారా వృద్ధులు, ఇతర వ్యాధిగ్రస్తులకు వైరస్‌ ముప్పు పొంచి ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు, తమ దేశానికే తొలుత వ్యాక్సిన్‌ అందజేయాలంటూ ఆయా దేశాలు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుండడంపై (వ్యాక్సిన్‌ నేషనలిజం) డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాలను పక్కనబెట్టి కేవలం కొన్ని దేశాలే కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కలిగి ఉండడం వల్ల కరోనా సంక్షోభం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఒప్పందానికి ప్రపంచదేశాలు కలిసిరావాలని పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు ‘కొవాగ్జ్‌ గ్లోబల్‌ వ్యాక్సిన్స్‌ ఫెసిలిటీ’ ఒప్పందంలో చేరాలని సంపన్న దేశాలను డబ్ల్యూహెచ్‌వో కోరింది. 

సమర్థ వ్యాక్సిన్‌తోనే హెర్డ్‌ ఇమ్యూనిటీ

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే సమర్థ వ్యాక్సిన్‌ అవసరమని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. వైరస్‌ను అడ్డుకునేందుకు అవసరమైన ఇమ్యూనిటీకి ప్రపంచం ఇంకా చాలా దూరంలో ఉన్నదని తెలిపింది. సాధారణంగా వ్యాక్సినేషన్‌ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యపడుతుంది. 70 శాతం మంది జనాభాలో మహమ్మారిని అడ్డుకునే యాంటీబాడీస్‌ ఉంటే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కనీసం 50 శాతం మందిలో యాంటీబాడీస్‌ ఉన్నా వైరస్‌కు ముకుతాడు వేయొచ్చని మరికొందరు భావిస్తున్నారు. అయితే వీటిని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగ అధిపతి మైఖెల్‌ ర్యాన్‌ కొట్టివేశారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే ఊహల్లో మనం జీవించకూడదని చెప్పారు. ప్రపంచ జనాభాను బట్టి చూస్తే, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే ఇమ్యూనిటీ స్థాయిలకు మనం ఇంకా చేరుకోలేదని తెలిపారు. సమస్యకు ఇది పరిష్కారం కాదని చెప్పారు. కరోనా ముప్పు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఈ ఏడాది విస్తృతంగా యాంటీ ఫ్లూ వ్యాక్సినేషన్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ సలహాదారు డాక్టర్‌ బ్రూస్‌ చెప్పారు.


logo