సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 18:20:35

నకిలీ టీచర్ల నుంచి రూ.900 కోట్ల రికవరీ

నకిలీ టీచర్ల నుంచి రూ.900 కోట్ల రికవరీ

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖలో మోసపూరితంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ విద్యాపత్రాలతో ఉద్యోగాలు పొందిన 1,427 మంది ఉపాధ్యాయుల నుంచి రూ.900 కోట్లు రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అనామిక శుక్లా కేసు వెలుగులోకి రాగానే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖల్లో ఉపాధ్యాయుల భర్తీని తనిఖీ చేయాలని సీఎం ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కుంభకోణాన్ని వెలికితీసేందుకు స్పెషల్‌ టాస్క్‌పోర్స్‌ (ఎస్టీఎఫ్) స్థాపించిన అనంతరం పెద్ద ఎత్తున మోసాలు బయటకు వస్తున్నాయి. అనామిక శుక్లా పేరిట ఉద్యోగం పొందిన నకిలీ అనామికతోపాటు 24 జిల్లాల్లో 1,427 మంది నకిలీ ఉపాధ్యాయులను ఎస్టీఎఫ్‌ అరెస్టు చేసింది. 930 మంది ఉద్యోగాలను రద్దు చేయడంతోపాటు 497 మందిపై కేసు నమోదైంది. వీరికి సహాయం చేసిన వారిపై కూడా ప్రభుత్వం కన్ను వేస్తున్నది. నకిలీ ఉపాధ్యాయులపై చర్యల వివరాలను అందివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ అధికారులను ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ కోరారు. ఈ వివరాలు ఒకటిరెండురోజుల్లోగా డైరెక్టరేట్‌కు అందనున్నాయి. ఈ నివేదిక బేసిక్ ఎడ్యుకేషన్ అదనపు చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి చేరిన తర్వాత నకిలీల నుంచి రికవరీ చేయడం  మొదలుకానున్నది. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి రూ.60 లక్షల చొప్పున వసూలు చేయనున్నారు.

నకిలీ బీఈడీ డిగ్రీలను తేల్చే పనిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నిమగ్నమయ్యారు. దాదాపు అరవై శాతం నకిలీ డిగ్రీలను ఎస్టీఎఫ్ బయటకు తీసిన తరువాత నకిలీల సంచలన వార్త రాష్ట్రమంతా వ్యాపించింది. నకిలీ డిగ్రీల సాయంతో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాల్లో చేరారు. వీరిలో 117 మంది రూ.50 కోట్లకు పైగా జీతం తీసుకున్న వారు ఉన్నట్టు ఎస్టీఎఫ్‌ తేల్చింది. నకిలీ ఉపాధ్యాయులందరికీ నోటీసు జారీ చేసి వారంలోపు డబ్బు జమ చేయాలని ఆదేశించనున్నట్లు సమాచారం. 

కాస్‌గంజ్‌లోని అనామిక శుక్లా ఎపిసోడ్ తరువాత.. ప్రాథమిక విద్యామండలి పాఠశాలల్లో జరిపిన ఉపాధ్యాయ నియామకాల్లో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. దీంతో కౌన్సిల్ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల డేటాను హ్యూమన్ సంపాడా పోర్టల్, ప్రేర్నా యాప్‌లో అప్‌లోడ్ చేసిన తరువాత.. పాన్‌ నంబర్‌ను మార్చడం ద్వారా జీతాలు పొందిన వందలాది మంది ఉపాధ్యాయులు తేలారు. బరాబంకిలో జరిపిన రికార్డుల పరిశీలనలో ఐదుగురు ఉపాధ్యాయులు, ఒక నాలుగో తరగతి ఉద్యోగి ఒకే పాన్ నంబర్‌ కలిగివుండగా.. వారి ఖాతా సంఖ్య మాత్రం భిన్నంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన రికార్డులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.


logo