ఆదివారం 29 మార్చి 2020
International - Feb 07, 2020 , 02:30:49

హెచ్చరించాడు.. బలయ్యాడు!

హెచ్చరించాడు.. బలయ్యాడు!
  • కరోనా గురించి తొలిసారిగా తెలిపిన చైనా వైద్యుడు వెన్‌ లియాంగ్‌ మృతి
  • వైరస్‌ బారినపడి చికిత్స తీసుకుంటూ..
  • తొలుత ఆయన హెచ్చరికను పట్టించుకోని ప్రభుత్వం

బీజింగ్‌, ఫిబ్రవరి 6: ప్రాణాంతక కరోనా గురించి తమ ప్రభుత్వాన్ని తొలిసారిగా గతేడాదే హెచ్చరించిన చైనా వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ (34).. చివరికి అదే వైరస్‌ బారిన పడి గురువారం మరణించారు. కరోనా వైరస్‌కు కేంద్రంగా మారిన వుహాన్‌లోని సెంట్రల్‌ హాస్పిటల్‌లో లీ వెన్‌ లియాంగ్‌ నేత్ర వైద్యుడిగా పని చేసేవారు. తమ దవాఖానకు వచ్చిన ఏడుగురు రోగులలో ‘సార్స్‌' తరహా వ్యాధి లక్షణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. 


దీని గురించి గతేడాది డిసెంబర్‌ 30న తన సహచర వైద్యులకు చైనా మెసేజింగ్‌ యాప్‌ వీచాట్‌లో ఆయన తెలియజేశారు. ఈ లక్షణాలు గల రోగులందరూ వుహాన్‌లోని మాంసాహార మార్కెట్‌ నుంచి మాంసాహరం కొన్న వారేనని పేర్కొన్నారు.ఈ వివరాలు వీచాట్‌లో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి వదంతులు వ్యాపింపచేయొద్దని హెచ్చరించి లీ వెన్‌లియాంగ్‌ నుంచి జనవరి 3న రాతపూర్వకంగా హామీపత్రం తీసుకున్నారు. 


అనంతరం దవాఖానలో రోగులకు చికిత్సనందిస్తుండగా లీ వెన్‌ లియాంగ్‌కు ‘కరోనా’ సోకింది. జనవరి 12 నుంచి చికిత్స పొందుతూ గురువారం ఆయన కన్నుమూశారు. వెన్‌లియాంగ్‌ హెచ్చరికలపై చైనా ప్రభుత్వం ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఆ వ్యాధిని ఎదుర్కోవడం సులభమై ఉండేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చైనాలో కరోనా వల్ల బుధవారం 73మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 564కు చేరింది. వుహాన్‌లో 1500 పడకల సామర్థ్యంతో నిర్మించిన నూతన దవాఖానను గురువారం ప్రారంభించారు. 


logo