గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 08:40:05

కాటేస్తున్న కరోనా!

కాటేస్తున్న కరోనా!
  • చైనాలో 82కి చేరిన మృతుల సంఖ్య
  • వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించాలని కేంద్రం నిర్ణయం
  • విదేశాల్లోనూ వేగంగా వ్యాప్తి

న్యూఢిల్లీ: చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. చైనాలో ఈ వైరస్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య అనూహ్యంగా 82కి చేరుకున్నది. మరో 2,774 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 24 మంది మృతిచెందినట్లు చైనా ‘జాతీయ హెల్త్‌ కమిషన్‌' వెల్లడించింది. వైరస్‌ ప్రాథమిక దశలో (ఇంక్యుబేషన్‌ పీరియడ్‌) ఉన్నప్పటికీ అది వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని, అలాగే వ్యాప్తిచెందే దాని సామర్థ్యం కూడా పెరుగుతున్నదని పేర్కొంది. ఆదివారం నాటికి 82 మంది మృతిచెందారని, 51 మంది కోలుకున్నారని వెల్లడించింది. మొత్తంగా 5,794 అనుమానిత కేసులు నమోదయ్యాయని పేర్కొంది.


బాధితులతో సన్నిహితంగా ఉన్న మొత్తం 32,799 మందిని గుర్తించామని, వారిలో 583 మందిని ఆదివారం డిశ్చార్చి చేయగా, మిగిలిన వారిని ఇంకా వైద్య పర్యవేక్షణలోనే ఉంచినట్లు వివరించింది. కాగా, భయాందోళనల్లో ఉన్న ప్రజలు, వైద్య సిబ్బందిలో ైస్థెర్యం నింపేందుకు చైనా ప్రధాని లీ కెకియాంగ్‌.. కరోనా ప్రభావం అధికంగా ఉన్న వుహాన్‌ నగరంలో సోమవారం పర్యటించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్‌ సోమవారం బీజింగ్‌కు చేరుకున్నారు. కరోనా వైరస్‌ను డబ్ల్యూహెచ్‌ఓ ఇంకా గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించలేదు. మరోవైపు వివిధ దేశాల నుంచి చైనాపై ఒత్తిడి పెరుగుతున్నది. వుహాన్‌లో చిక్కుకుపోయిన తమ ప్రజలను విమానాల ద్వారా తరలించేందుకు అనుమతించాలని ఆయా దేశాలు కోరుతున్నాయి. కాగా, వైరస్‌ నియంత్రణకు చైనా చర్యలను ముమ్మరం చేసింది. విద్యాసంస్థలకు స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ సెలవులను మూడు రోజులపాటు పొడిగించింది. కరోనా బాధితుల కోసం రెండు దవాఖానలను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నది.చైనా పర్యాటకులపై మలేషియా నిషేధం..

విదేశాల్లోనూ వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తున్నది. ఇప్పటికే హాంకాంగ్‌, మకావ్‌, తైవాన్‌లలో 17 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. థాయ్‌లాండ్‌ (7), జపాన్‌ (3), దక్షిణకొరియా (3), అమెరికా (3), వియత్నాం (2), సింగపూర్‌ (4), మలేషియా (3), నేపాల్‌ (1), ఫ్రాన్స్‌ (3), ఆస్ట్రేలియా (4)లోనూ  వైరస్‌ తీవ్రత పెరుగుతున్నది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి వచ్చే పర్యాటకులపై మలేషియా తాత్కాలికంగా నిషేధం విధించింది. మరోవైపు, మంగోలియా.. చైనాతో  సరిహద్దులను మూసివేసింది. 


భారతీయుల తరలింపునకు కేంద్రం చర్యలు

కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న చైనాలోని వుహాన్‌ నగరంలో చిక్కుకుపోయిన  250 మందికిపైగా భారతీయులను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.  కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అధ్యక్షతన సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు నేపాల్‌ సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆదివారం వరకు 137 విమానాల్లో భారత్‌కు చేరుకున్న 29,707 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరిలోనూ వైరస్‌ లక్షణాలు కనబడలేదని కేంద్రం తెలిపింది. వుహాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించాలని కేరళ సీఎం పినరాయి విజయన్‌ ప్రధానికి సోమవారం లేఖ రాశారు. భారతీయుల తరలింపునకు ఇప్పటికే బోయింగ్‌ 747 విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు, ప్రభుత్వ ఆదేశాల కోసమే వేచిచూస్తున్నట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు.


logo
>>>>>>