శుక్రవారం 05 జూన్ 2020
International - May 02, 2020 , 22:49:19

వుహన్ లో క‌ల‌కలం.. గాలిలో కరోనా జాడలు

వుహన్ లో క‌ల‌కలం.. గాలిలో కరోనా జాడలు

ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి రెండు ల‌క్షల మందిని బ‌లితీసుకుంది. ఇంకా బాధితుల సంఖ్య అర‌కోటి దగ్గ‌రికి చేరుకోబోతుంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి గురించి ఇప్పటివరకు అనేక వార్తలు వ‌స్తున్నాయి. కొందరు గాలి ద్వారా వ్యాపిస్తుందని అంటే.. మరికొందరు ప్రత్యక్ష తాకిడితోనే వస్తుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో కరోనా పుట్టినిల్లు వుహన్‌లో సంచలన విషయాలు  వెలుగులోకి వ‌చ్చాయి. ఇంకా అక్క‌డ  స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో  కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు గుర్తించారు. వుహన్ నగరంలోని రెండు ఆసుపత్రుల గాలిలోని తుంపర్లలో కరోనాను గుర్తించినట్లు అక్క‌డి మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. దీనితో మరోసారి వుహన్‌లో అలజడి రేగింది. 

అయితే నివాస ప్రాంతాల్లోని గాలిలో మాత్రం ఎటువంటి వైరస్ జాడ కనిపించలేదని వివ‌రించింది. కాగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితో పాటు కరోనా బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు. అంతేకాకుండా జనాలు నివాసం ఉండే ప్రాంతాల నుంచి కూడా గాలి నమూనాలను తీసుకున్నారు. వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత ఆసుపత్రులు మినహాయించి మిగిలిన అన్ని చోట్లు సురక్షితంగా ఉన్నాయని తేల్చారు. గాలి నమూనాలు తప్పితే మరెక్కడా కూడా కరోనా జాడ కనిపించట్లేద‌ని  ఆ క‌థ‌నంలో పేర్కొంది. కాగా గాలిలో ఉన్న కరోనా వైరస్ ఎంతమేరకు ప్రభావం చూపుతున్నది వెల్లడి కాలేదు.


logo