బుధవారం 03 జూన్ 2020
International - Apr 18, 2020 , 01:23:58

50% పెరిగిన వుహాన్‌ మరణాలు

50% పెరిగిన వుహాన్‌ మరణాలు

  • కరోనా కేసులు, మరణాల వివరాలను సవరించిన చైనా ప్రభుత్వం

బీజింగ్‌/వుహాన్‌: కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్యలో, దీని వల్ల మరణించిన వారి సంఖ్యలో చైనా మార్పులు చేసింది. ప్రధానంగా వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌ నగరంలో మరణాలను దాదాపు 50 శాతం పెంచి చూపింది. దీంతో కరోనా విషయంలో తొలి నుంచి చైనాను విమర్శిస్తున్న అమెరికా మరోసారి ధ్వజమెత్తింది. అమెరికాకుతోడు బ్రిటన్‌ కూడా గొంతు కలిపింది. కరోనా వైరస్‌ వల్ల వుహాన్‌లో 2,579 మంది మరణించారని, 50,008 మంది ఈవ్యాధి బారి న పడ్డారని ఇటీవల చైనా ప్రకటించింది. అయితే ఈ గణాంకాలను శుక్రవారం సవరించింది. వుహాన్‌లో కరోనా వల్ల మొత్తం 3,869 మంది మరణించారని తెలిపింది. తాజాగా 1,290 మరణాల వివరాలు వెలుగులోకి వచ్చాయని, దీంతో ఈ సంఖ్య 3,869కి చేరిందని పేర్కొంది. అలాగే వైరస్‌ సోకినట్లు తాజాగా 325 మంది వివరాలు వెల్లడయ్యాయని, దీంతో ఈ సంఖ్య 50,333కు చేరిందని వివరించింది. ఈ వివరాలు సవరించడానికి గల కారణాలను కూడా ప్రస్తావించింది. వుహాన్‌లో వైరస్‌ విజృంభించడంతో చాలా మంది ఇండ్లల్లోనే చికిత్సపొందుతూ మరణించారని తెలిపింది. ఈ వివరాలు సకాలంలో అందకపోవడంతో తాము కూడా అప్పట్లో అందుబాటులో ఉన్న వివరాలనే ప్రకటించామని తెలిపింది. కానీ ఈ వివరాలు ఇప్పుడు ప్రభుత్వానికి చేరడంతో మార్పులు చేశామని వివరించింది. కాగా కరోనా కేసుల వివరాలను చైనా దాచిపెడుతున్నదని పలుసార్లు అమెరికా విమర్శించిన విషయం తెలిసిందే.


logo