ఆదివారం 31 మే 2020
International - Apr 03, 2020 , 14:57:26

కరోనా: మైనారిటీలను నిందించడం తగదన్న అమెరికా

కరోనా: మైనారిటీలను నిందించడం తగదన్న అమెరికా

హైదరాబాద్: కరోనా వంటి విశ్వమహమ్మారి వ్యాప్తిపై మతపరమైన మైనారిటీలను నిందించడం తగదని అమెరికా అభిప్రాయపడింది. ప్రస్తుత గడ్డుకాలంలో మైనారిటీలతో ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా వ్యవహారాల ప్రత్యేక రాయబారి శామ్ బ్రౌన్‌బ్యాక్ పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన మతపరమైన ఖైదీలను విడుదల చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇరాన్, చైనా దేసాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మతపరమైన సమూహాలు సామాజిక దూరాన్ని పాటించాలని, ప్రస్తుతం అదే తక్షణ కర్తవ్యమని మీడియాతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన చెప్పారు. ఏయే దేశాల్లో మతపరమైన మైనారిటీలను కరోనా వ్యాప్తికి నిందిస్తున్నారో అమెరికా గమనిస్తున్నదని బ్రౌన్‌బ్యాక్ వెల్లడించారు. దురదృష్టవశాత్తు చాలా దేశాల్లో ఇది జరుగుతున్నది. కానీ ప్రభుత్వాలు ఇలా చేయడం సరికాదు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలకాలి. కరోనా వైరస్‌కు మైనారిటీలు మూలం కాదని స్పష్టం చేయాలి - అని ఆయన చెప్పారు. అయితే మతపరమైన భావాలతో జిహాద్ జరపాలని భావించేవారిని, భవనాలు పేల్చాలనుకునేవారిని కటకటాల్లో పెట్టడం విషయంలో ప్రభుత్వాలకు సర్వ హక్కులు ఉన్నాయని ఆయన తేల్చిచెప్పారు. అమెరికాలో మేమూ అదే చేస్తాం.. నేను కాన్సస్ గవర్నర్‌గా ఉన్నప్పుడూ అదే చేశాను - అని అమెరికా ప్రత్యేక రాయబారి నొక్కిచెప్పారు. 


logo