శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 27, 2021 , 11:39:25

అంత‌రిక్షం కోసం ప్ర‌పంచ‌ కుబేరుల కొట్లాట‌

అంత‌రిక్షం కోసం ప్ర‌పంచ‌ కుబేరుల కొట్లాట‌

న్యూయార్క్‌: ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంప‌న్నులైన ఎలోన్ మ‌స్క్‌, జెఫ్ బెజోస్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన ఫైట్ న‌డుస్తోంది. భూమిపై అయిపోయింది ఇప్పుడిక వాళ్లు అంత‌రిక్షంలో ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారు. ఈ కొట్లాట ఇప్పుడు అమెరికా రెగ్యులేట‌ర్ అయిన ఫెడ‌ర‌ల్ క‌మ్యూనికేష‌న్స్ క‌మిష‌న్‌ ముందుకు వెళ్లింది. ఇంత‌కీ ఈ కుబేరుల మ‌ధ్య ఆ కొట్లాట ఏంటి? ఒక‌సారి చూద్దాం.

శాటిలైట్ల ఎత్తుతోనే స‌మ‌స్య‌

ఈ మ‌ధ్యే ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడైన ఎలోన్ మ‌స్క్‌కు చెందిన సంస్థ స్పేస్ ఎక్స్ వెయ్యికిపైగా స్టార్‌లింక్ క‌మ్యూనికేష‌న్స్‌ శాటిలైట్ల‌ను ఒకేసారి అంత‌రిక్షంలోకి పంపిన సంగ‌తి తెలుసు క‌దా. భ‌విష్య‌త్తులో మ‌రికొన్ని వేల శాటిలైట్ల‌ను పంపేందుకు కూడా ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే ఆ శాటిలైట్ల‌ను గ‌తంలో చెప్పిన దాని కంటే త‌క్కువ కక్ష్య‌లో ఉంచేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని స్పేస్ ఎక్స్.. ఫెడ‌ర‌ల్ క‌మ్యూనికేష‌న్స్ క‌మిష‌న్ అనుమ‌తి కోరింది. అయితే దీనికి జెఫ్ బెజోస్ సంస్థ అమెజాన్ ఐఎన్‌సీ అభ్యంత‌రం చెబుతోంది. 

అమెజాన్ స‌మ‌స్య ఏంటి?

ఒక‌వేళ స్టార్‌లింక్ శాటిలైట్ల‌కు త‌క్కువ క‌క్ష్య‌లో ఉంచేందుకు అనుమ‌తి ఇస్తే.. అది భ‌విష్య‌త్తులో తాము పంపించ‌బోయే క్యూప‌ర్ శాటిలైట్ల‌తో ఢీకొనే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని అమెజాన్ వాదిస్తోంది. స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్‌లాగే అమెజాన్ క్యూప‌ర్ కూడా ఇంట‌ర్నెట్ సేవ‌ల కోస‌మే పంపిస్తున్న శాటిలైట్లు కావ‌డం విశేషం. అంత‌రిక్షంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఈ ఇద్ద‌రూ రెగ్యులేట‌ర్ ముందు ఎవ‌రి వాద‌న‌లు వాళ్లు వినిపిస్తున్నారు. స్పేస్ ఎక్స్ చేస్తున్న మార్పుల వ‌ల్లే శాటిలైట్ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య పోటీ నెల‌కొన్న‌ద‌ని, ఇది స్పేస్ ఎక్స్ ప్ర‌యోజ‌నం కోసం చేస్తున్న‌దే త‌ప్ప‌ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నం కోసం కాద‌ని అమెజాన్ వాదిస్తోంది. 

అమెజాన్‌కు మ‌స్క్ కౌంట‌ర్‌

అయితే అమెజాన్ వాద‌న‌ను ఎలోన్ మ‌స్క్ తిప్పి కొట్టారు. అమెజాన్ ఎప్పుడో భ‌విష్య‌త్తులో పంపించ‌బోయే శాటిలైట్ల కోసం ఇప్పుడు త‌మ స్టార్‌లింక్ శాటిలైట్ల‌కు అనుమ‌తి ఇవ్వొద్ద‌న‌డం ఏంట‌ని మ‌స్క్ ప్ర‌శ్నించారు. పైగా త‌క్కువ క‌క్ష్య‌లో ఉంటే మ‌రింత మెరుగ్గా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించేందుకు వీలు ప‌డుతుంద‌ని మ‌స్క్ అంటున్నారు. ఇప్ప‌టికే వెయ్యికిపైగా శాటిలైట్ల‌ను పంపిన స్పేస్ ఎక్స్‌.. యూఎస్‌, యూకే, కెన‌డాల్లో క‌స్ట‌మ‌ర్ల వేట మొద‌లుపెట్టింది. అటు అమెజాన్ కూడా ఏకంగా 3,236 శాటిలైట్ల‌ను పంపించాల‌ని నిర్ణ‌యించింది. అయితే దీనికి నిర్ణీత తేదీని మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. కానీ త‌మ శాటిలైట్ల‌ క‌క్ష్య త‌గ్గించుకుంటామ‌న్న‌‌ స్పేస్ ఎక్స్ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించాల‌ని ఎఫ్‌సీసీని కోరింది.

వేలాది శాటిలైట్లు

ఇంట‌ర్నెట్ సేవ‌ల కోసం స్పేస్ ఎక్స్‌, అమెజాన్ వేలాది శాటిలైట్ల‌ను అంత‌రిక్షంలోకి పంప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. స్పేస్ ఎక్స్ 12 వేల శాటిలైట్లను ఆప‌రేట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తుండ‌గా.. ఇప్ప‌టికే 4400 శాటిలైట్ల‌కు అనుమ‌తి వ‌చ్చింది. మ‌రో 2824 శాటిలైట్ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది. అటు అమెజాన్ కూడా 3 వేల‌కుపైగా శాటిలైట్ల‌ను పంప‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. 

VIDEOS

logo