జకర్తా, ఆగస్టు 15: బూడిద రంగు బొచ్చు, తెలుపు, నలుపు చారలు, ముద్దుగొలిపే ఆకారంతో 15 అంగుళాలు కూడా లేని సుమత్రన్ స్ట్రిప్డ్ కుందేలు అది. పుష్కరకాలంగా దాని ఉనికి అస్సలు తెలియట్లేదు. ప్రపంచం మొత్తం జల్లెడపట్టినా వాటి సంఖ్య పట్టుమని పది కూడా ఉంటాయో లేదోనని పరిశోధకుల అనుమానం. జంతుప్రేమికుడైన ఓ వ్యక్తి ఇటీవల ఫేస్‌బుక్‌ను బ్రౌజ్ చేస్తుండగా ఓ పోస్టు ఆతని దృష్టిని ఆకర్షించింది. సుమత్రన్ కుందేలును అమ్మకానికి పెట్టామని ఆ పోస్టు సారాంశం. దాంతో అతను ఇండోనేషియా జంతుసంరక్షణ అధికారులకు సమాచారమిచ్చాడు. వారు దాన్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు. 1972లో తొలిసారిగా ఈ కుందేలు జాతిని గుర్తించగా తర్వాత 2-3 సార్లకు మించి చూడలేదని జంతుప్రేమికులు చెబుతున్నారు.