ఆదివారం 29 మార్చి 2020
International - Mar 22, 2020 , 12:16:24

ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మూడు నెలల క్రితం చైనాలో బయటపడ్డ కరోనా వైరస్‌ ఒక్కో దేశానికి పాకుతూ మొత్తం 184 దేశాలకు విస్తరించింది. వేల మందిని పొట్టనపెట్టుకుంది. లక్షల మందిని బాధితులుగా మార్చింది. దేశంలోనూ కరోనా విజృంభన కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 324 మంది ఈ మహమ్మారి బారినపడగా నలుగరు మృతిచెందారు.  

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులే కాదు, మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,99,391 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 66,907 మంది కోలుకోగా.. 12,888 మంది మరణించారు. ఈ మహమ్మారి అత్యంత ఎక్కువగా చైనా, ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌ దేశాలపై ప్రభావం చూపుతున్నది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్‌, యూకేల్లో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 

చైనాలో 81,054 కేసులు నమోదుకాగా.. 3,261 మంది మృతిచెందారు. ఇటలీలో 53,578 మందికి వైరస్‌ సోకగా 4,825 మంది మరణించారు. ఇక స్పెయిన్‌లో 24,926 మందికి వైరస్‌ బాధితుల్లో 1,326 మంది.. ఇరాన్‌లో 20,610 మంది వైరస్‌ బాధితుల్లో 1556 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా దేశాల్లోనూ వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. భారత్‌ సహా మరికొన్ని దేశాల్లో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్నది.         


logo