గురువారం 09 జూలై 2020
International - Jun 25, 2020 , 18:04:08

కోటికి చేరువలో కరోనా కేసులు.. ప్రపంచ దేశాల్లో ఆక్సిజన్‌ కొరత

కోటికి చేరువలో కరోనా కేసులు.. ప్రపంచ దేశాల్లో ఆక్సిజన్‌ కొరత

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటికి చేరుతున్నది. ప్రతి రోజు లక్షన్నరకుపైగా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 93 లక్షల మంది కరోనా బారిన పడగా, 4,80,000 మంది ఈ వైరస్‌ వల్ల మరణించారు. పలు దేశాల్లో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. దీంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 88 వేల పెద్ద ఆక్సిజన్‌  సిలిండర్లకు డిమాండ్‌ ఉన్నదని, 6,20,000 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ అవసరమవుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోం గేబ్రియేసెస్ తెలిపారు. ఆక్సిజన్‌కు ఒక్కసారిగా భారీగా డిమాండ్‌ పెరుగడంతో శ్వాస సంబంధ రోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 14 వేల ఆక్సిజన్‌ సిలిండర్లను డబ్ల్యూహెచ్‌వో కొనుగోలు చేసిందని, వచ్చే వారంలో 120 దేశాలకు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో ఆరు నెలలకు అవసరమ్యే వంద మిలియన్‌ డాలర్ల ( రూ.756 కోట్లు) విలువైన 1,70,000 ఆక్సిజన్‌ సిలిండర్లను సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు టెడ్రోస్ వివరించారు. logo