ఆదివారం 24 జనవరి 2021
International - Dec 09, 2020 , 18:10:00

వేడెక్కుతున్న భూగోళం.. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆందోళ‌న‌

వేడెక్కుతున్న భూగోళం..  ఐక్య‌రాజ్య‌స‌మితి ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌: కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల క‌ర్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల త‌గ్గినా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్న‌ట్లు ఐక్యరాజ్య‌స‌మితి తాజాగా త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.  ఈ శ‌తాబ్ధం చివ‌రి నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌గ‌టు ఉష్ణోగ్ర‌త‌లు మూడు డిగ్రీల సెల్సియ‌స్ క‌న్నా ఎక్కువ‌గా పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు యునైటెడ్ నేష‌న్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్ఈపీ) హెచ్చ‌రించింది.గ‌త ఏడాది గ్రీజ్‌హౌజ్ వాయువుల విడుద‌ల తారాస్థాయికి చేరిన‌ట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో చెప్పింది.  దీని వ‌ల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు గ‌డ్డ‌లు క‌రిగాయ‌ని, సైబీరియా, అమెరికాలో దావానాలు చెల‌రేగిన‌ట్లు యూఎన్ఈపీ పేర్కొన్న‌ది.  2020 సంవ‌త్స‌రంలో ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత  అధిక స్థాయిలో న‌మోదు అయిన‌ట్లు రికార్డులు చెబుతున్నాయ‌ని,  అడువులు అంటుకోవ‌డం.. తుఫాన్లు, నీటి క‌రువు లాంటి స‌మ‌స్య‌లు ఎదురైన‌ట్లు యూఎన్ఈపీ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ ఇంగ‌ర్ అండ‌ర్స‌న్ తెలిపారు.  అయితే వాతావ‌ర‌ణ మార్పుల‌పై జ‌రిగిన పారిస్ ఒప్పందం ప్ర‌కారం ల‌క్ష్యాల‌ను అందుకోవాలంటే మ‌రింత శ్ర‌మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 

కోవిడ్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు మంద‌గించాయ‌ని, దీని వ‌ల్ల గ్రీన్‌హౌజ్ వాయువులు కూడా త‌గ్గాయ‌ని, కానీ ఇదొక్క‌టే వాతావ‌ర‌ణ స‌మ‌స్య‌ను తీర్చ‌లేద‌ని యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు. గ్రీన్‌హౌజ్ వాయువుల‌పై రిలీజైన ఈ యేటి నివేదిక‌ను ప‌రిశీలిస్తే, కార్బ‌న్‌డైయాక్సైడ్ విడుదుల అధిక మోతాదులో ఉన్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు.  ఇలాగే కొన‌సాగితే ఈ శ‌తాబ్ధం చివ‌ర వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు స‌గ‌టున మూడు డిగ్రీల సెల్సియ‌స్ పెర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  మ‌హ‌మ్మారి వేళ వాతావ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌కు ప్రాధాన్యం ఇస్తే, అప్పుడు ఉష్ణోగ్ర‌త‌ల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు అని ఆయ‌న అన్నారు.  గ్లోబ‌ల్ వార్మింగ్‌ను నియంత్రించేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌న్నారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న వినియోగాన్ని పెంచాల‌న్నారు. శిలాజ ఇంధ‌న స‌బ్సిడీలు వ‌ద్ద‌ని, కొత్త‌గా బొగ్గు ప‌వ‌ర్ ప్లాంట్లకు అనుమ‌తి ఇవ్వొద్ద‌న్నారు. జీ20 దేశాలు ఈ నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేయాల‌ని ఆయ‌న తెలిపారు.


logo