శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 02:01:29

బాలల్ని పట్టించుకోని ప్రపంచం

బాలల్ని పట్టించుకోని ప్రపంచం
  • బాలల ఆరోగ్యంపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలు
  • ధనిక దేశాల ఉద్గారాలతో పిల్లలకు ముప్పు
  • చిరుతిళ్లు, తియ్యటి పానీయాల వల్ల హాని
  • డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా బాలల ఆరోగ్యాన్ని, వారి పరిసరాలను, భవిష్యత్తును ఏ ఒక్క దేశం కూడా పట్టించుకోవడం లేదని 40 మంది ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్‌ చేసిన ఫాస్ట్‌ ఫుడ్‌, తియ్యటి శీతల పానీయాలు, మద్యం, పొగాకు వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), యూనిసెఫ్‌, లాన్సెట్‌ జర్నల్‌ సంయుక్తంగా ఈ ఆరోగ్య నిపుణులతో ఏర్పాటు చేసిన కమిషన్‌ ఇచ్చిన నివేదికను బుధవారం విడుదల చేశారు. పర్యావరణం దెబ్బతినడం, వాతావరణ మార్పులు, దోపిడీతో కూడిన మార్కెటింగ్‌ విధానాల కారణంగా ప్రపంచంలోని బాలలు, టీనేజర్లకు ముప్పు అత్యంత సమీపంలో ఉన్నదని ఆ నివేదిక పేర్కొంది. గత 20 ఏండ్లలో బాలలు, టీనేజర్ల ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ, పురోగతి మాత్రం ఆగిపోయిందని, అయితే మళ్లీ క్షీణించే ప్రమాదం ఉన్నదని న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని, కమిషన్‌ కో చైర్మన్‌ హెలెన్‌ క్లార్క్‌ పేర్కొన్నారు. అల్ప, మధ్యాదాయ దేశాలలో ఐదేండ్లలోపు పిల్లలు దాదాపు రెండున్నర కోట్ల మందిలో పేదరికం కారణంగా తగిన ఎదుగుదల లేదని చెప్పారు. వాణిజ్యపరమైన విధానాలు, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచంలోని పిల్లలందరూ ప్రస్తుతం అస్తిత్వ పోరాటం చేస్తున్నారని తెలిపారు. 


అత్యంత పేద దేశాలు తమ పిల్లలు ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి వారి సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని ఆ నివేదిక సూచించింది. సంపన్న దేశాలలో అధికంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలతో ప్రపంచంలోని పిల్లలందరికీ ముప్పు వాటిల్లుతున్నదని హెచ్చరించింది. 2100 సంవత్సరం నాటికి భూతాపం నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగిపోతే.. సముద్ర మట్టం పెరుగటం, వడగాలుల ఉద్ధృతి, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల విజృంభణ, పోషకాహార లోపం వల్ల బాలల ఆరోగ్యంపై విపత్కర ప్రభావం పడుతుందని కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో నార్వే, కొరియన్‌ రిపబ్లిక్‌, నెదర్లాండ్స్‌లలోని పిల్లలు మాత్రమే ఆరోగ్యంగా ఉంటూ జీవించగలుగుతారని తెలిపింది. ఇక సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, చాద్‌, సోమాలియా, నైజర్‌, మాలీ వంటి దేశాలలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. కర్బన ఉద్గారాలను పూర్తిగా నియంత్రించాలని, హానికరమైన ఆహార పదార్థాలు, పానీయాల మార్కెటింగ్‌ను అరికట్టాలని సూచించింది.


logo