గురువారం 28 మే 2020
International - May 14, 2020 , 03:20:45

టార్గెట్‌ చైనా

టార్గెట్‌ చైనా

  • ప్రతీకారేచ్ఛతో ప్రపంచ దేశాలు
  • ప్రపంచ ఆరోగ్య సదస్సులో నిలదీతకు సిద్ధం 
  • పన్నులు మరింత పెంచుతామన్న అమెరికా
  • 16 వేల కోట్ల డాలర్లకు జర్మన్‌ పత్రిక దావా
  • అంతర్జాతీయ కోర్టులో నిలదీయాలి: బ్రిటన్‌

గత ఐదు నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై సర్వత్రా ఆగ్రహం  వ్యక్తమ వుతున్నది చైనా నిర్లక్ష్యం కారణంగానే రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పలుదేశాల అధినేతలు మండిపడుతున్నారు. జన నష్టమే కాకుండా ఆర్థికంగా కూడా తాము దెబ్బతినడానికి కారణమైన చైనాను శిక్షిస్తామంటూ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాలన్నీ చైనాకు గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నాయి.

కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో విఫలమైందంటూ ప్రపంచవ్యాప్తంగా చైనాపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చైనా కారణంగానే రెండున్నర లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, తాము తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ప్రపంచదేశాలన్నీ మండిపడుతున్నాయి. డ్రాగన్‌కు గుణపాఠం నేర్పాలని, ఆ దేశాన్ని శిక్షించాల్సిందేనని పలువురు దేశాధినేతలు, డిమాండ్‌ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అది చైనాను వెనకేసుకొచ్చిందని విమర్శిస్తున్నారు. దీనిపై త్వరలో జరుగనున్న ప్రపంచ ఆరోగ్య సదస్సులో చైనాను, డబ్ల్యూహెచ్‌వోను నిలదీసేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ సదస్సులో చైనాకు వ్యతిరేకంగా ఓ తీర్మానం ప్రవేశపెడుతామని యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది.

కరోనా విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని, దీనిపై దర్యాప్తు జరిపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా పలువురు ప్రపంచదేశాధినేతలు డిమాండ్‌ చేస్తున్నారు. డ్రాగన్‌ నిజాయితీగా వ్యవహరించాలని జర్మనీ చాన్సలర్‌ ఏంజిలా మెర్కెల్‌, చైనాను అంతర్జాతీయ కోర్టులో నిలబెట్టాలని బ్రిటన్‌ రక్షణమంత్రి బెన్‌ వాలెస్‌, స్వీడన్‌ ఆరోగ్య మంత్రి లీనా హాలెన్‌గ్రెన్‌ డిమాండ్‌ చేశారు. స్వీడన్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ సహా పలు దేశాలు చైనా ధోరణిపై ఆగ్రహంవ్యక్తం చేస్తున్నాయి. చైనాలో  మృతుల సంఖ్య ఐదువేల లోపే ఉండటం అనుమానాలను రేకెత్తిస్తున్నది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయడం వల్లనే తగ్గించగలిగామన్న మాటలను ఏ దేశమూ నమ్మే పరిస్థితి లేదు. వైరస్‌ పుట్టుకపై పరిశోధన జరిపేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తలపై ఉక్కుపాదం మోపింది. దీంతో వైరస్‌ విషయంలో చైనా వైఖరి సందేహాస్పదంగా మారింది.  

ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్‌

కరోనావిషయంలో పలు దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఏకమవుతుండగా, భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఇటీవల అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ విదేశాంగ మంత్రులతో దీనిపై చర్చించారు. కాగా, ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థకు చెందిన ‘స్వరాజ్య’ పత్రిక కరోనాకు చైనాయే కారణమంటూ ఇటీవల ఒక వ్యాసం ప్రచురించగా చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్‌ విచారం వ్యక్తంచేశారు. 

పెట్టుబడుల తరలింపునకు జపాన్‌ 220 కోట్లు

చైనాలో పెట్టుబడులను మరో ప్రాంతానికి తరలించేందుకు జపాన్‌ తమ పరిశ్రమాధిపతుల కోసం 2.2 బిలియన్‌ డాలర్లు మంజూరుచేసింది. హువావేపై జర్మనీ, బ్రిటన్‌లు పునరాలోచనలో పడ్డాయి. 


అహం తగ్గని చైనా

తనపై వస్తున్న విమర్శలపై చైనా ఎదురుదాడికి దిగుతున్నది. నెదర్లాండ్స్‌కు వైద్య సహాయం నిలిపివేస్తామని గత వారం హెచ్చరించింది. 160 బిలియన్‌ డాలర్లకు దావా వేసిన జర్మనీ పత్రిక ‘బిల్డ్‌'పై ఆ దేశంలోని చైనా రాయబారి ఘర్షణకు దిగారు. కరోనాపై దర్యాప్తు జరుపుతామన్న ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా చైనా అధికార మీడియా కొన్నిరోజులుగా అనేక కథనాలను వండి వార్చింది. సన్నిహిత సంబంధాలున్న ఫ్రాన్స్‌పైనా చైనా దౌత్యవేత్తలు అనుచిత విమర్శలు చేశారు.  జిన్‌పింగ్‌కు ఫోన్‌చేసి కృతజ్ఞతలు తెలుపాలని పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్‌ దూడాపై చైనా రాయబారి ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. 

కరోనా కాదు..చైనా వైరస్‌: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై ఒంటికాలిమీద లేస్తున్నారు. కొవిడ్‌-19ను చైనా వైరస్‌ అని ఆరోపించారు. వైరస్‌ ఎలా పురుడుపోసుకుందో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగా విడుదలచేసి ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైరస్‌ ఎక్కడ పుట్టిందో కనుగొనాలని నిఘా సంస్థలను ఆదేశించారు. చైనా నుంచి నష్టాన్ని వసూలు చేయాలని, మృతి చెందిన ఒక్కో అమెరికన్‌కు కోటి డాలర్ల చొప్పున పరిహారం కోరాలని ట్రంప్‌ భావిస్తున్నారు. మిస్సోరీ అటార్నీ జనరల్‌ ఇప్పటికే చైనాపై ఫెడరల్‌ కోర్టులో కేసు కూడా వేశారు. 


logo