న్యూయార్క్: కరోనా వైరస్ వ్యాక్సిన్లపై మేధో సంపత్తి హక్కులను ఎత్తేయాలన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ స్పష్టం చేశారు. ఇది ఫార్మాసూటికల్స్ రంగంలో ఆవిష్కరణలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ అంశంపై చర్చలను పునఃప్రారంభించిన సమయంలో వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇండియా, సౌతాఫ్రికాతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రతిపాదనను డబ్ల్యూటీవో ముందు ఉంచిన విషయం తెలిసిందే.
ఈ ప్రతిపాదనను సమర్థిస్తారా అని మల్పాస్ను ప్రశ్నించగా.. దీనికి మద్దతు ఇవ్వబోము. ఎందుకంటే ఇది ఈ రంగంలో ఆవిష్కరణలను, పరిశోధనలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే ఈ ప్రతిపాదనను అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం సమర్థించిన విషజ్ఞం తెలిసిందే. ట్రంప్ నామినీ అయిన మల్పాస్ దీనిని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. వ్యాక్సిన్లు తయారుచేస్తున్న పెద్ద పెద్ద ఫార్మాసూటికల్ కంపెనీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి.
ఇక ధనిక దేశాలు తమ దగ్గర అవసరానికి మించి ఉన్న వ్యాక్సిన్లను వెంటనే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వాలని మల్పాస్ మరోసారి కోరారు. ప్రస్తుతానికి ప్రపంచ వృద్ధి రేటు 2021కి 5.6 శాతం, 2022కి 4.3 శాతంగా అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటే మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.