బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 02:02:20

భారత్‌తో కలిసి వ్యాక్సిన్‌ తయారీ

భారత్‌తో కలిసి వ్యాక్సిన్‌ తయారీ

  • వేగంగా పరిశోధనల కోసం ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌' 
  • ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం
  • భారత్‌కు వెంటిలేటర్లు అందిస్తాం: ట్రంప్‌ ప్రకటన 
  • ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 

వాషింగ్టన్‌, మే 16: తాము భారత్‌తో కలిసి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ట్రంప్‌ శుక్రవారం మీడియా తో మాట్లాడుతూ.. ‘నేను ఇటీవలే భారత్‌లో పర్యటించి వచ్చాను. మన దగ్గర ఎంతోమంది ఎన్నారైలు ఉన్నారు. అందులో వ్యాక్సిన్‌ తయారీకి శ్రమిస్తున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలూ ఉన్నారు. వారు గొప్పవారు’ అని భారత సంతతి ప్రజలను ప్రశంసించారు. కరోనాపై పోరుకు భారత్‌కు త్వరలో వెంటిలేటర్లు అందిస్తామన్నారు. ‘భారత్‌లోని మన స్నేహితులకు వెంటిలేటర్లు అందజేస్తామని ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉన్నది. విపత్కర సమయంలో మనం భారత్‌కు, ప్రధాని మోదీకి అండగా నిలువాలి’ అని ట్రంప్‌ అన్నారు. అయితే ఎన్ని వెంటిలేటర్లు అందించనున్నారో మాత్రం చెప్పలేదు. 

యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు 

వ్యాక్సిన్‌ తయారీ వేగం పెంచడానికి ట్రంప్‌ ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌'ను ప్రకటించారు. ఇందులో భాగంగా పరిశోధనల్లో సైన్యం సైతం భాగస్వామి అవుతుందన్నారు. ‘వేగంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి, పారిశ్రామిక ఉత్పత్తి, అవసరమైన దేశాలకు పంపిణీ’ ఈ ఆపరేషన్‌ ప్రధాన లక్ష్యాలని ట్రంప్‌ చెప్పారు. ఈ ఆపరేషన్‌కు ఆర్మీ జనరల్‌ గుస్తేవ్‌ పెర్నా, ఫార్మా కంపెనీ గ్లాస్కో స్మిత్‌ైక్లెన్‌ మాజీ సీఈవో మోన్సెఫ్‌ స్లావోయి నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఇది మన్‌హట్టన్‌ ప్రాజెక్టు తర్వాత అమెరికా చేపట్టిన భారీ ఆపరేషన్‌ అని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తొలి అణ్వాయుధ అభివృద్ధికి అమెరికా మన్‌హట్టన్‌ ప్రాజెక్టును చేపట్టింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడే ఉద్దేశం ప్రస్తుతం తనకు లేదన్నారు.  

వ్యాక్సిన్‌ తయారు చేసిన సిగరెట్‌ కంపెనీ


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పొగాకు కంపెనీ లండన్‌కు చెందిన బ్రిటిష్‌ అమెరికన్‌ టొబాకో సంస్థ శుక్రవారం వెల్లడించింది. కలిసి నడిస్తే కరోనారహిత ప్రపంచం: మోదీ 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశాలన్నీ కలిసి పనిచేస్తే కరోనా రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వెంటిలేటర్లు అందజేస్తామని ప్రకటించిన ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘డొనాల్డ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు. భారత్‌-అమెరికా స్నేహానికి ఇది మరింత శక్తినిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.


logo