బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 06:20:10

భారతీయ విద్యార్థులకు ఊరట

భారతీయ విద్యార్థులకు ఊరట

వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు ఆ దేశం ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ‘ఆఫ్‌-క్యాంపస్‌ వర్క్‌ ఆథరైజేషన్‌' కొరకు దరఖాస్తు (ఫామ్‌ ఐ-20) చేసుకోవచ్చని వెల్లడించింది. ఈమేరకు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌-క్యాంపస్‌ ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, వైద్య ఖర్చులు పెరిగిపోవడం వంటి ఊహించని పరిణామాలు ఎదురై.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఆఫ్‌-క్యాంపస్‌ వర్క్‌ ఆథరైజేషన్‌ కోసం అభ్యర్థన పెట్టుకోవచ్చని వెల్లడించింది. అయితే విద్యార్థులు పెట్టుకునే దరఖాస్తులపై వారు చదువుతున్న సంస్థల సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కోర్సు పూర్తయ్యే కాలంలో గరిష్ఠంగా ఏడాది కాలంపాటు ఆఫ్‌-క్యాంపస్‌ వర్క్‌ చేయవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం అమెరికాలో చిక్కుకున్న వందలాది మంది భారతీయ విద్యార్థులకు మేలు కలిగించనున్నది. 


logo