శనివారం 06 జూన్ 2020
International - May 17, 2020 , 01:44:55

రండి.. కెనడాకు రండి!

రండి.. కెనడాకు రండి!

  • విదేశీ విద్యార్థులకు ఆహ్వానం
  • పీజీడబ్ల్యూపీ నిబంధనల్లో మార్పులు

అట్టావా: విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కెనడా ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్‌ (పీజీడబ్ల్యూపీ)’ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. కెనడాలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కోర్సు పూర్తిచేసి అనంతరం అక్కడే ఉద్యోగం చేసేందుకు పీజీడబ్ల్యూపీ వీలు కల్పిస్తుంది. దీనికి అర్హత సాధించాలంటే విదేశీ విద్యార్థులు కనీసం 8 నెలల ఫుల్‌టైమ్‌ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సును బట్టి వర్క్‌ పర్మిట్‌ గడువు ఆధారపడి ఉంటుంది. కరోనా సంక్షోభంతోపాటు అమెరికా వలస నిబంధనలను కఠినతరం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కెనడా పీజీడబ్ల్యూపీ నిబంధనలను సరళీకరించింది. సాధారణంగా పీజీడబ్ల్యూపీకి ఆన్‌లైన్‌ కోర్సులను పరిగణనలోకి తీసుకోరు. అయితే కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఈ నిబంధనలను సడలించింది. స్వదేశంలో ఉంటూనే కెనడా విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ కోర్సులు చదివేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 50 శాతం వరకు విదేశాల్లోనే కోర్సు పూర్తిచేసినా, గ్రాడ్యుయేషన్‌ అనంతరం పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది. అలాగే కోర్సు సందర్భంగా విద్యార్థులు తమ స్వదేశంలో గడిపిన సమయాన్ని పీజీడబ్ల్యూపీ గడువు నుంచి కూడా తగ్గించరు. డిసెంబర్‌ 31 వరకు ఇది వర్తిస్తుంది. వచ్చే వర్షాకాలం నుంచి విదేశీ విద్యార్థులు కెనడా విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించవచ్చు. 


logo