గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 16, 2020 , 19:07:24

వర్క్‌ ఫ్రమ్‌ హోం.. ఇలానే ఉంటుంది మరీ..!

వర్క్‌ ఫ్రమ్‌ హోం.. ఇలానే ఉంటుంది మరీ..!

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి వల్ల చాలా మంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఆఫీస్‌లో వర్క్‌ సెటప్‌కు, ఇంట్లో వర్క్‌ సెటప్‌కు చాలా తేడా ఉంటుందనే విషయం తెలిసిందే. గత ఆరు నెలల్లో దీనికి సంబంధించిన ఎన్నో చిత్రవిచిత్రాలను సోషల్‌మీడియాలో చూస్తున్నాం. కాగా, అమెరికాకు చెందిన ఓ మహిళ తను చేసే వర్క్‌ ఫ్రం హోం ఎలా ఉంటుందో రెండు ఫోటోల ద్వారా కళ్లకు కట్టింది. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. పలువురు గమ్మత్తైన సలహాలు కూడా ఇస్తున్నారు.  .

అమెరికాకు చెందిన  శాస్త్రవేత్త, పీహెచ్‌డీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజీనీర్‌ అయిన గ్రెట్చెన్ గోల్డ్‌మన్‌ ట్విట్టర్‌లో ఆమె వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఫొటోలను పెట్టింది. వాతావరణ మార్పుపై మాట్లాడేందుకు సీఎన్‌ఎన్‌ చానల్‌లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో పంచుకున్నారు. ఒక ఫొటోలో తెరపై సూట్ ధరించి హుందాగా ఉన్నారు. మరొక ఫొటోలో చూస్తే పైన సూట్‌ ఉన్నా కింద కేవలం షార్ట్‌ మాత్రమే ఉంది. ఆ పక్కనే పిల్లలు ఆడుకునే బొమ్మలతో గది అంతా గందరగోళంగా ఉంది. ‘నేను నిజాయితీగా ఉన్నాను.’ అని ఫొటోలకు ఆమె క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు 1.7 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ‘మాదీ మీ పరిస్థితే’ అంటూ పలువురు వారి వర్క్‌ ఫ్రం హోం ఫొటోలను పంచుకున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo