లండన్: గర్భంతో ఉన్న మహిళ మళ్లీ గర్భం దాల్చింది. నెల తేడాతో మరోసారి గర్భం దాల్చడాన్ని వైద్య పరిభాషలో ‘సూపర్ఫెటేషన్’ అంటారు. బ్రిటన్లోని విల్ట్షైర్లో నివాసం ఉండే 39 ఏండ్ల రెబెకా రాబర్ట్స్, 43 ఏండ్ల రైస్ వీవర్ దంపతులకు పెండ్లైన ఏడాదికిపైగా సంతానం కలుగలేదు. అయితే గత ఏడాది రెబెకా గర్భం దాల్చింది. తొలి అల్ట్రాసౌండ్ పరీక్షలో కడుపులోని పిండం ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలుసుకుని ఆ దంపతులు చాలా సంతోషించారు. అయితే ఐదు వారాల తర్వాత 12 వారాల గర్భంతో రెబెకా అల్ట్రాసౌండ్ పరీక్షకు వెళ్లగా వారి ఆనందరం ఆవిరైంది. సోనోగ్రామ్ స్క్రీన్లో పలుమార్లు పరీక్షించిన సోనోగ్రాఫర్ షాకింగ్ విషయం చెప్పారు. రెబెకా గర్భంలో మూడు వారాలున్న మరో పిండం పెరుగుతున్నదని వెల్లడించారు. గర్భవతిగా ఉన్న ఆమె మళ్లీ గర్భం దాల్చిందని నిర్ధారించారు.
సాధారణంగా మహిళ గర్భం దాల్చినప్పుడు అండం విడుదల ఆగిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. అయితే రెబెకా విషయంలో ఇలా జరుగలేదు. ఆమె గర్భం దాల్చిన మూడు వారాల తర్వాత మరో అండం విడుదలైంది. అది శుక్రకణంతో కలిసి మరో పిండంగా ఏర్పడింది. కాగా, అండం విడుదల కోసం మెడిసిన్స్ తీనేకునే సందర్భంలో కొన్నిసార్లు రెండు అండాలు ఒకేసారి విడుదలైనప్పుడు లేదా ఒక అండం, రెండు శుక్రకణాలతో కలిసిన సందర్భాల్లో కవల పిల్లలు జన్మిస్తారు.
అయితే రెబెకా విషయంలో మాత్రం అలా జరుగలేదు. ఆమె గర్భంతో ఉండగా మరోసారి గర్భందాల్చింది. ఈ అరుదైన ‘సూపర్ఫెటేషన్’ వంటి కేసులు ఇప్పటి వరకు పది లోపే ఉన్నట్లు యూరోపియన్ జర్నల్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్, గైనకాలజీ అండ్ రిప్రొడక్టివ్ బయాలజీలో ప్రచురితమైంది. ఇలాంటి కేసుల్లో కవల పిల్లల మధ్య కొన్ని నెలల తేడా ఉంటుంది. దీంతో తొలి బిడ్డ నెలలు నిండిన కొన్ని నెలల తర్వాత రెండో బిడ్డకు నెలలు నిండుతాయి. ఇలాంటి సందర్భాల్లో విడివిడిగా కాన్పు జరుగడం, రెండో బిడ్డ జీవించడం చాలా కష్టం.
మరోవైపు రెబెకా 33 వారాల గర్భవతిగా ఉండగా చిన్న పిండంలో పెరుగుదల సాధారణంగా లేనట్లు గుర్తించారు. బిడ్డ ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 17న సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. దీంతో రెబెకా నెల తేడా ఉన్న ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. బాబైన తొలి బిడ్డ నోహ్ 4 పౌండ్లు బరువు ఉండగా, మరో బిడ్డ పాప రోసాలీ కేవలం 2 పౌండ్లు బరువు మాత్రమే ఉన్నది. దీంతో ఇద్దరు పిల్లలను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. మూడు వారాల తర్వాత బాబును డిశ్చార్జ్ చేయగా, పాప మాత్రం 95 రోజులపాటు వైద్యుల సంరక్షణలో ఉన్నది.
గత ఏడాది క్రిస్మస్ ముందు రోజున ఆ దంపతులు పాపను ఇంటికి తీసుకువచ్చారు. కరోనా కాలం కావడంతో ఇద్దరు పిల్లలను కంటికిరెప్పలా కాపాడుకున్నారు. కవలలిద్దరూ ఒకే రోజున జన్మించినప్పటికీ జన్యుపరంగా సుమారు నెల రోజులు తేడా ఉన్న ఈ అరుదైన అన్నాచెల్లెళ్లకు సంబంధించిన విషయాలను రెబెకా దంపతులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతుంటాయని తమ పిల్లలే దీనికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.