వాషింగ్టన్: ఒక మహిళ వైద్యపరంగా 45 నిమిషాలు మరణించింది. అయితే అనూహ్యంగా మనుమరాలు పుట్టే ముందు బతికింది. ఈ అద్భుత సంఘటన అమెరికాలో జరిగింది. మేరీల్యాండ్‌కు చెందిన కాథీ పట్టెన్ గోల్ఫ్ ఆడుతుండగా ఆమె కుమార్తె స్టేసీ ఫిఫర్కు పురిటి నొప్పులు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో కాన్పు సమయంలో తన కుమార్తె వద్ద ఉండేందుకు ఆమె హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది.
అయితే ఆసుపత్రికి రాగానే కాథేకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించారు. సీపీఆర్, ఆక్సిజన్ అందించడం వంటివి డాక్టర్లు చేశారు. అయితే ఆమె గుండె కొట్టుకోవడం లేదు. పల్స్, బీపీ పడిపోయాయి. సుమారు 45 నిమిషాలు బ్రెయిన్‌కు ఆక్సిజన్ సరఫరా కాలేదు. అంటే వైద్యపరంగా కాథీ 45 నిమిషాలు మరణించింది. కాగా, వైద్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
మరోవైపు అదే ఆసుపత్రిలో పురుటి నొప్పులు వచ్చిన ఆమె కుమార్తె స్టేసీ ఫిఫర్కు అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమె ఒక పాపకు జన్మ ఇచ్చే ముందు అద్భుతం జరిగింది. వైద్యపరంగా 45 నిమిషాలు చనిపోయిన కాథీ గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. చివరకు ఆమె తిరిగి బతికింది. ఈ ఏడాది జూలై 22న ఈ మిరాకిల్ జరిగింది.
పూర్తిగా కోలుకున్న కాథీ దీని గురించి ఇటీవల మిర్రర్‌కు వివరించారు. ‘జీవించేందుకు నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గొప్ప వ్యక్తిని అవుతాను. అదృష్టవశాత్తు తిరిగి బతికాను. అది భయానకంగా ఉంది. నా జీవితంలో ఇది రెండవ అధ్యాయం’ అని ఆమె చెప్పారు.
మరోవైపు తనకు కుమార్తె అలోరా పుట్టినప్పుడు చాలా అద్భుతం జరిగిందని, వైద్యపరంగా చనిపోయిన తన తల్లి తిరిగి ఈ లోకంలోకి వచ్చిందని స్టేసీ ఫిఫర్ తెలిపారు. మిరాకిల్ వల్లనే ఇది జరిగిందని, తన కుమార్తె పుట్టిన వేళావిశేషమంటూ ఆమె పొంగిపోయింది.
కాగా, కాథీకి చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ డోవ్ ఫ్రాంకెల్ కూడా ఈ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ‘తిరిగి జీవించిన కాథీకి నేను స్వాగతం చెప్పను. ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఆమె మాకు జీవిత అర్థాన్ని నేర్పించారు. బతుకుపై ఆశ ఎప్పటికీ వదులుకోకూడదన్న అర్థం ఏమిటో మాకు చూపించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.