బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 15:07:32

కరోనా భయం.. కారు దిగని వృద్ధ దంపతులు..

కరోనా భయం.. కారు దిగని వృద్ధ దంపతులు..

కరోనా వైరస్‌ పేరు వినగానే ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఒక వేళ బయటకు వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడి సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

అమెరికాలోని ఒరేగాన్‌ పట్టణంలో 80 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు తమ కారులో సూపర్‌ మార్కెట్‌కు వచ్చారు. కానీ వారు కారు నుంచి బయటకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఎందుకంటే కరోనా వైరస్‌ తమపై ఎక్కడా దాడి చేస్తుందో అనే భయం. ఆ వృద్ధ దంపతులు కాలు బయట పెట్టేందుకు గజగజ వణుకుతున్నారు. మరి నిత్యవసర సరుకులు మాత్రం కచ్చితంగా కొనాల్సిందే. అందు కోసం ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ.. వృద్ధ మహిళ సహాయమంటూ అరిచింది. ఈ అరుపులు విన్న ఓ యువతి కారు వద్దకు చేరుకుంది. 

కారులో ఉన్న వృద్ధ దంపతులను చూసి సదరు యువతి ఏంటి? అని అడిగింది. కరోనా భయంతో బయటకు రాలేకపోతున్నామని.. కొంచెం సరుకులు కొనిపెట్టగలవా? అని యువతిని వృద్ధులు అడిగారు. ఆ యువతి ఓకే చెప్పడంతో.. 100 డాలర్లతో పాటు సరుకుల జాబితా ఇచ్చింది. యువతి సూపర్‌ మార్కెట్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన సరుకులను తీసుకొచ్చి ఇచ్చింది. మిగిలిన డాలర్లను కూడా తిరిగి ఇచ్చేసింది. 

తమకు సహాయం చేసేందుకు సరైన వ్యక్తి ఎవరైనా వస్తారా అని 45 నిమిషాల పాటు ఎదురు చూశాం. చివరకు మీరు వచ్చి సహాయం చేశారని ముసలావిడ యువతికి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ఎవరూ కూడా సాహసం చేయరు. కానీ సహాయం చేయమని అడిగితే తప్పకుండా సహాయం చేయాలని యువతి చెప్పారు. యువతి చేసిన మంచి పనికి ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెను మెచ్చుకున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. 


logo
>>>>>>