శుక్రవారం 03 జూలై 2020
International - Jun 18, 2020 , 18:29:21

రెస్టారెంట్లో తిన్నారు.. క్వారంటైన్ అయ్యారు..

రెస్టారెంట్లో తిన్నారు.. క్వారంటైన్ అయ్యారు..

ఫ్లోరిడాః ఒకవైపు కరోనా భయం వెంటాడుతున్నా.. తననేం చేయలేదన్న ఓ మహిళ గొప్పలకు పోయిందంట. తానే కాకుండా స్నేహితులను కూడా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కరోనా వైరస్‌కు గురై  ఇప్పుడు హోంక్వారంటైన్‌లో కరోనా.. కరోనా అంటూ బాధపడుతున్నదంట. 

ఫ్లోరిడాకు చెందిన ఎరికా క్రిస్ప్‌ అనే 40 ఏండ్ల అమ్మడు సరదాగా స్నేహితులతో కలిసి జాక్సన్‌విల్లే బీచ్‌లోని హాటల్‌కు వెళ్లింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కమ్మటి భోజనానికి ఆర్డరిచ్చి లొట్టలేసుకొంటూ తిన్నారు. అయితే, ఇంటికెళ్లగానే సదరు అమ్మడికి గొంతులో నొప్పితో పాటు జ్వరం కూడా అంటుకుంది. ఇంకేం సమీపంలోని దవాఖానకు పరుగెత్తుకెళ్లి పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయం  తెలిసిన అధికారులు ఆమెతో కలిసి భోజనానికి వెళ్లిన 15 మందికి కూడా పరీక్షలు జరుపగా.. వారికందరికీ కరోనా పాజిటివ్ గా నివేదికలు వచ్చాయి. ఇప్పుడు వీరంతా దవాఖానలోని క్వారంటైన్‌ వార్డులో చికిత్స తీసుకొంటున్నారు. 

కరోనా వ్యాప్తితో నెలల తరబడి ఇంటికే పరిమితమైన ఆమె తన స్నేహితులతో కలిసి జూన్ 6న లించ్ లోని ఐరిష్ పబ్లో చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆరోగ్య కార్యకర్త ఒకరు చెప్పారు. అయితే విందు తర్వాత ఎరికా క్రిప్స్‌ ఆమె స్నేహితులు అందరికి వైరస్ సోకినట్టు తెలిపారు. రెస్టారెంట్లు తిరిగి తెరవడంతో విందుకు వచ్చారని, అయితే మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆరోగ్య కార్యకర్త తెలిపారు.

ఈ నేపథ్యంలో జాక్సన్‌విల్లే బీచ్‌లోని రెండు మూడు హోటళ్లలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుపగా.. లించ్‌ ఐరిష్‌ పబ్‌లో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందికి కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆ హోటల్‌  యాజమాన్యం గత వారం స్వచ్ఛందంగా రెస్టారెంట్ మూసివేసి శానిటైజ్ చేయించారు. చూశారుగా, లాక్‌డౌన్‌ ఎత్తివేశారని తమకింకేం కాదని దర్జాగా తిరిగితే కరోనా వైరస్‌ మిమ్మల్ని వదలదని గుర్తుంచుకోండి. ముక్కుకు మాస్క్‌ ధరించడం, చేతులు, కాళ్లు పరిశుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు. 


logo