గురువారం 16 జూలై 2020
International - Jun 22, 2020 , 07:54:32

ఒకేరోజు 1.83 లక్షల కరోనా కేసులు: డబ్ల్యూహెచ్‌వో

ఒకేరోజు 1.83 లక్షల కరోనా కేసులు: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తున్నది. ఎంతలా అంటే ఆదివారం ఒక్కరోజే ప్రపంచం అన్ని దేశాల్లో కలిపి 1,83,000 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,743 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771 ఉండగా, అమెరికాలో 36,617, భారత్‌లో 15,400 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 

90లక్షల 44వేలు దాటిన కరోనా కేసులు

నిన్న పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,44,563కి చేరింది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,70,665 మంది బాధితులు మరణించారు. వైరస్‌ బారినపడిన 48,37,952 మంది కోలుకోగా, మరో 37,35,946 మంది చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఆదివారం 36వేల పైచిలుకు కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23,56,657కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 1,22,247 మంది మరణించగా, 12,54,055 మంది చికిత్స పొంతున్నారు. మరో 9,80,355 మంది బాధితులు కోలుకున్నారు. బ్రెజిల్‌లో కరోనా కేసులు ర్యాపిడ్‌ స్పీడ్‌లో రికార్డవుతున్నాయి. దీంతో దేశంలో 10,86,990 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 50,659 మంది మృతిచెందారు. మరో 4,57,105 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

రష్యాలో ఇప్పటివరకు 5,84,680 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా 8,111 మంది బాధితులు మరణించారు. భారత్‌లో నిన్న ఒక్క రోజే 15,400 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,26,910కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 13,703 మంది మరణించారు. ఐదో స్థానంలో ఉన్న యూకేలో ఇప్పటివరకు 3,04,331 కరోనా కేసులు నమోదవగా, 42,632 మంది బాధితులు కన్నుమూశారు. 

స్పెయిన్‌లో- 2,93,352 కేసులు, 28,323 మరణాలు

పెరూలో- 2,54,936 కేసులు, 8,045 మరణాలు

చిలీలో- 2,42,355 పాజిటివ్‌ కేసులు, 4,476 మరణాలు

ఇటలీలో- 2,38,499 కేసులు, 34,634 మరణాలు

ఇరాన్‌లో- 2,04,952 కేసులు, 9,623 మరణాలు 

చైనాలో నిన్న కొత్తగా 25 కేసులు నమోదవగా, అందులో రాజధాని బీజింగ్‌లోనే  22 కేసులు ఉన్నాయి. దక్షిణ కొరియాలో సుమారు 200 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా సియోల్‌కు సంబంధించినవే ఉన్నాయి. స్పెయిన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మార్చి 14 నుంచి కొనసాగుతున్న స్టేట్‌ ఎమర్జెన్సీని (లాక్‌డౌన్‌) ప్రభుత్వం ఎత్తివేసింది. యూరోపియన్‌ దేశాల నుంచి వచ్చేవారికి 14 రోజులు క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది.


logo