మా సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తాం.. ఆస్ట్రేలియాకు గూగుల్ హెచ్చరిక

ఆస్ట్రేలియా, గూగుల్ మధ్య వివాదం కొనసాగుతోంది. వార్తల కోసం స్థానిక పత్రికలకు డబ్బు చెల్లించాలన్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తామని హెచ్చరించింది. వార్తా సంస్థలు ఇచ్చే వార్తల వల్ల గూగుల్ ఆర్జించే ఆదాయంలో పత్రికలకు కూడా పరిహారం చెల్లించాలంటూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఇది సాధ్యం కాదు అని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో 94 శాతం సెర్చ్‌లు గూగుల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ హెచ్చరికలకు స్పందించం: ప్రధాని
అయితే గూగుల్ హెచ్చరికలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలకు తాము స్పందించబోమని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో మీరు ఏం చేయవచ్చో చెప్పే నిబంధనలను ఆస్ట్రేలియానే రూపొందిస్తుంది. ఇది మా పార్లమెంట్లో జరిగే పని. మా ప్రభుత్వం చేసే పని. ఆస్ట్రేలియాలో ఇలాగే ఉంటుంది అని మారిసన్ తేల్చి చెప్పారు. ఈ చట్టం వర్తించే ఫేస్బుక్ కూడా దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేస్తే.. ఫేస్బుక్లో ఆస్ట్రేలియన్లు వార్తలు షేర్ చేయకుండా బ్లాక్ చేస్తామని ఇప్పటికే ఆ సంస్థ హెచ్చరించింది. స్థానిక మీడియా పరిశ్రమకు మద్దతుగా ఆస్ట్రేలియా ఈ వివాదాస్పద చట్టం చేసింది.