శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 28, 2020 , 15:48:42

గాలిలో వైరస్ వ్యాప్తిపై కొత్త నిజాలు!

గాలిలో వైరస్ వ్యాప్తిపై కొత్త నిజాలు!

హైదరాబాద్: కరోనా వైరస్ గాల్లో తేలదని ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. అయితే జనాలు గుంపులుగా చేరే చోట, గాలి బయటకు వెళ్లే అవకాశం లేని చోట గాలిలో కరోనా రేణువులు ఎగురుతూ ఉండవచ్చునని తాజా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా మొదటిసారిగా విజృంభించిన చైనాలోని వూహాన్‌లో రెండు హాస్పిటల్స్‌లో వైరస్ తాలూకు జన్యుపదార్థం గాలిలో ఎగురుతూ కనిపించిందని నేచర్ రిసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా జనం ఎక్కువగా తిరిగే చోట, వైద్యసిబ్బంది తమ రక్షణ దుస్తులు విప్పేచోట, ఇంకా టాయిలెట్లలో ఈ పదార్థం కనిపించిందని తెలిపారు. అయితే ఆ జన్యు పదార్థం ఇన్‌ఫెక్షన్ కలిగించే స్థాయిలో ఉందా అనేది తెలియరాలేదు. గాలిద్వారా వైరస్ వ్యాపిస్తుందా అనే ప్రశ్న కరోనా వైరస్ బయటపడినప్పటి నుంచీ ఉంది. అయితే కొన్ని పరిమిత పరిస్థితుల్లోనే గాలిద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. చైనాలో 75 వేలకు పైగా కేసులపై జరిపిన పరిశోధన ఈ సంగతి వెల్లడించింది. ఇప్పుడు వైరస్ విశ్వవ్యాప్తమై కేసుల సంఖ్య 30 లక్షలు దాటడంతో మరోసారి ఇన్‌ఫెక్షన్ దారుల గురించిన చర్చ మొదలైంది. ఊపిరి తీసినప్పుడు, దగ్గినప్పుడు లేక మాట్లాడినప్పుడు మనుషులు రెండు రకాల తుంపర్లను సృష్టిస్తారు. పెద్ద తుంపర్లు నేలమీదగానీ, వస్తువుల మీదగానీ పడతాయి. ఆవిరయ్యేలోగా అక్కడ ఎవరైనా ముట్టుకుంటే వైరస్ వ్యాపించవచ్చు. ఇక చిన్నతుంపర్లు. వీటినే ఏరోసోల్స్ అంటారు. ఇవి గాల్లో గంటలపాటు వేలాడుతూ ఉంటాయి. తొలిరోజుల్లో రోగులను ఉంచిన హాస్పిటల్స్ లో వూహాన్ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏరోసోల్ ట్రాప్స్ ఏర్పాటు చేసింది. పేషంటు వార్డులు, సూపర్ మార్కెట్లు, నివాస భవనాల్లో కొన్ని ఏరోసోల్ కణాలు లభించాయి. వైద్య సిబ్బంది రక్షణ దుస్తులు మార్చుకునే ప్రదేశాల్లో కూడా అవి కనిపించాయి. అంటే వారి దుస్తుల మీద నుంచి అవి గాల్లోకి చేరి ఉంటాయి. గదులలో గాలి సరిగా ఆడేలా చూడడం, జనాలు ఎక్కువగా గుమిగూడకుండా చూడడం, పారిశుధ్యం ముఖ్యమని ఈ అధ్యయనం మరోసారి నొక్కిచెప్తున్నది.


logo