శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 08, 2020 , 02:32:35

మనకు మంచేనా?

మనకు మంచేనా?

  • భారత్‌తో బైడెన్‌ దోస్తీ కొనసాగించేనా?

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపుతో.. భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? ద్వైపాక్షిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి?  భారత్‌ విషయంలో బైడెన్‌ వైఖరి ఎలా ఉండనుంది? ఇప్పుడివే ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలు. ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్‌.. భారత్‌కు సుపరిచితుడే. ఎన్నికల ప్రచారంలో ఆయన భారత్‌ పట్ల సానుకూలంగానే స్పందించారు. ఇండియాకు సంబంధించి ఆయన కొన్ని విషయాల్లో ట్రంప్‌ను అనుసరించవచ్చు. మరికొన్ని విషయాల్లో భిన్నదారులు వెతుకవచ్చు. చైనా విషయంలో ఆయన అనుసరించబోయే వైఖరి అటు భారత్‌-అమెరికా, ఇటు భారత్‌-చైనా సంబంధాలపైనా ప్రభావం చూపనుంది.

 కమలా హ్యారిస్‌ఉపాధ్యక్షురాలిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్‌.. విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు. ఒక పర్యాయం మాత్రమే తాను అధ్యక్షుడిగా కొనసాగవచ్చని బైడెన్‌ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. తదుపరి అధ్యక్ష రేసులో హ్యారిసే ముందుండనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ విషయంలో ఆమె ఏ విధంగా వ్యవహరించనున్నారో చూడాల్సి ఉన్నది. 

 రక్షణ

రక్షణ రంగ విషయంలో ఇరుదేశాల సంబంధాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. 2000 ఏడాది నుంచి భారత్‌ విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానానికే బైడెన్‌ కట్టుబడి ఉండొచ్చు.  

 చైనాతో సంబంధాలు

చైనాతో సంబంధాల విషయంలో బైడెన్‌ వైఖరి భిన్నంగా ఉండనుంది. ఇది భారత్‌-అమెరికా, భారత్‌-చైనా సంబంధాలపై ప్రభావం చూపనుంది. చైనా విషయంలో దూకుడుగానే వ్యవహరించాలని బైడెన్‌ సలహాదారులు పలువురు సూచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను విడదీయలేమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రత, సాంకేతిక రంగాల్లో భిన్న వ్యూహాలు అనుసరించవచ్చు.

 ఇండో-పసిఫిక్‌ స్ట్రాటజీ

ఇండో-పసిఫిక్‌ స్ట్రాటజీపై బైడెన్‌ శిబిరం ఇంకా స్పష్టతనివ్వలేదు. ఇక్కడ భారత్‌ కీలకం కానున్న నేపథ్యంలో బైడెన్‌ యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించనుందో చూడాల్సి ఉన్నది. 

మానవ హక్కుల ఉల్లంఘనలు

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలపై బైడెన్‌ ప్రభుత్వం స్పందించవచ్చు. హిందూ అతివాదం, జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను లేవనెత్తవచ్చు. 

 పారిస్‌ ఒప్పందం

పారిస్‌ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరవచ్చు.  బొగ్గు వినియోగం విషయంలో భారత్‌ను బైడెన్‌ ప్రభుత్వం నిందించే అవకాశం ఉన్నది.

వాణిజ్యం

ఒబామా హయాంలోనూ వాణిజ్య వివాదాలు కొనసాగాయి. ఇందుకు బైడెన్‌ కూడా అతీతుడేమీ కాదు.  

హెచ్‌1బీ వీసాలు

హెచ్‌1బీ వీసాల జారీ ప్రక్రియ ఇంతకుముందున్న స్థితికి రాకపోవచ్చు. ఇది భారతీయ నిపుణులపై ప్రభావం చూపనుంది.