మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 17:12:00

కమలాదేవి హారిస్ నే జో బిడెన్ ఎందుకు ఎంచుకున్నారు?

కమలాదేవి హారిస్ నే జో బిడెన్ ఎందుకు ఎంచుకున్నారు?

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మూలాలున్న కమలాదేవి హారిస్ ను డెమోక్రాట్లు ఎంపికచేశారు. ఒకప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు కమలాదేవి హారిస్ గట్టిగా పాటుపడ్డారు. అయితే డెమోక్రటిక్ పార్టీ జో బిడెన్ వైపు మొగ్గుచూపడంతో కమలాదేవి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. నవంబర్ లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఆమీతుమీకి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ సిద్ధమయ్యారు. అయితే అధ్యక్ష ఎన్నికలు నల్లేరు మీద నడక కాకపోవడంతో కొత్త ఎత్తులు ఎత్తుకొంటున్నారు జో బిడెన్. తన తాజా ఎత్తుల్లో భాగంగా అమెరికాలోని భారతీయులను, అలాగే నల్లజాతీయులను బుట్టలో వేసుకోనున్నారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాదేవి పేరు మొదటి ఎంపిక అని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పుడో బహిరంగంగా ప్రతిపాదించారు. అయితే, కమలాను ఈ పదవికి అభ్యర్థిగా చేయడం ద్వారా డెమోక్రాట్ పార్టీ రెండు సందేశాలను ఇవ్వాలనుకుంటుంది. ఇదే సమయంలో వీటి ఆధారం చేసుకునే అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని చూస్తున్నారు.

ఒక దెబ్బకు రెండు పిట్టలు

జాతి సమానత్వానికి చిహ్నంగా కమలాదేవిని డెమోక్రాట్ పార్టీ వర్ణిస్తున్నది. కమలాదేవిలో ఇండో-ఆఫ్రికన్ సంతతికి మూలాలు ఉండటం డెమోక్రాట్ పార్టీకి కలిసొచ్చే అంశం. అమెరికాలో జాతి వివక్ష జరగదని కమలాదేవి హారిస్ అభ్యర్థిత్వంతో రుజువు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు సాధారణంగా డెమోక్రాట్ల మద్దతుదారులుగా భావిస్తారు. అందుకే బరాక్ ఒబామా, జో బిడెన్, హిల్లరీ క్లింటన్.. ఇలా అందరూ భారతీయులపై దృష్టి పెట్టారు. ట్రంప్ ఇటీవల హెచ్ -1 బీ వీసాలపై కఠినమైన నిషేధాన్ని ప్రకటించినప్పుడు.. మార్పు చేయాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. కమలాదేవిని ఉపాధ్యక్ష అభ్యర్థిగా చేయడం ద్వారా భారతీయులు, ఆఫ్రికన్ సంతతి పౌరులకు రిపబ్లికన్ పార్టీ నుంచి పూర్తిగా భిన్నంగా భావిస్తున్నారని సందేశం పంపాలని డెమోక్రాటిక్ పార్టీ కోరుకుంటున్నది. ఇటీవలి జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత నల్లజాతీయులకు రిపబ్లికన్లపై వ్యతిరేకత పెరిగింది. దీనిని డెమోక్రాట్లు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

అసమ్మతి రాకుండా జాగ్రత్త పడటం

డెమొక్రాటిక్ పార్టీ ఆన్-రికార్డ్ సమావేశాలలో జో బిడెన్‌ను కమలాదేవి చాలాసార్లు విమర్శించారు. ట్రంప్‌ ను వ్యతిరేకిస్తూనే విదేశాంగ విధానం పట్ల మనం చాలా మృదువైన వైఖరి తీసుకోవాలని కమలాదేవి ఇటీవల తన పార్టీ నేతలకు సూచించారు. అమెరికాను అగ్రస్థానంలో ఉంచడానికి కఠినమైన, మృదువైన విధానాలను ఉంచడం అవసరమని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జో బిడెన్ కుమారుడితో కమలాదేవికి మంచి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో జో తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పవచ్చు. తనను విమర్శించిన వ్యక్తినే ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడం అంటే తనపై విమర్శలు రాకుండా చూసుకోవడమే అని జో బిడెన్ భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో అభిప్రాయాలను తనకు అనుకూలంగా మలుచుకునేలా జో చూస్తున్నారు. కమలాదేవిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా అటు భారతీయులు, ఇటు నల్లజాతీయులను తమవైపు తిప్పుకోవాలన్న కార్యచరణతో డెమోక్రాట్లు ముందుకెళ్తున్నారు. కమలాదేవి కార్డు జో గెలుపునకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నవంబర్ వరకు వేచిచూడాల్సిందే!


logo