శనివారం 30 మే 2020
International - Apr 15, 2020 , 18:41:13

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధులు ఎలా వస్తాయి ?

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధులు ఎలా వస్తాయి ?

హైద‌రాబాద్‌: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య‌ సంక్షోభం నెల‌కొన్న‌ స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధుల‌ను నిలిపేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించ‌డంతో ఆ సంస్థ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో మొత్తం 194 దేశాల‌కు స‌భ్య‌త్వం ఉన్న‌ది.  ఆ దేశాలు డ‌బ్ల్యూహెచ్‌వోకు నిధుల‌ను ఇస్తుంటాయి. వాటితో పాటు బ‌య‌టి నుంచి వ‌చ్చే విరాళాల‌ను కూడా డ‌బ్ల్యూహెచ్‌వో స్వీక‌రిస్తుంటుంది. దేశంలో ఉన్న సంప‌ద‌, జ‌నాభా ఆధారంగా స‌భ్య‌త్వ రుసుమును డ‌బ్ల్యూహెచ్‌వో వ‌సూల్ చేస్తుంది. తాజా రికార్డుల ప్ర‌కారం.. డ‌బ్ల్యూహెచ్‌వోలో స‌భ్య‌త్వం కోసం ఆఫ్ఘ‌నిస్తాన్ సుమారు 35వేల డాల‌ర్లు చెల్లించింది.  ఇది మెంబ‌ర్‌షిప్ మొత్తంలో కేవ‌లం 0.007 శాతం మాత్ర‌మే. ఇక అమెరికా స‌భ్య‌త్వ రుసుము 116 మిలియ‌న్ల డాల‌ర్లు. ఇది మెంబ‌ర్‌షిప్ రుసుము మొత్తంలో 22 శాతంగా ఉన్న‌ది.

స‌భ్య‌త్వాల ద్వారా డ‌బ్ల్యూహెచ్‌వోకు వ‌స్తున్నమొత్తం దాని సంప‌ద‌లో పావు వంతు కూడా ఉండ‌దు. కానీ స్వ‌చ్ఛంద విరాళాలు ద్వారా డ‌బ్ల్యూహెచ్‌వోకు ఎక్కువ సంఖ్య‌లోనే నిధులు వ‌స్తుంటాయి. 2018-19 రెవ‌న్యూ రికార్డు ప్ర‌కారం.. డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా సుమారు 400 మిలియ‌న్ల డాల‌ర్లు ఇచ్చింది. ఆ సంస్థ‌కు అమెరికానే పెద్ద కాంట్రిబ్యూట‌ర్‌. ఇక ఆ త‌ర్వాత స్థానంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ ఉన్న‌ది.  డ‌బ్ల్యూహెచ్‌వో నిధుల‌ను నిలిపివేయాల‌ని ట్రంప్ ప్ర‌క‌ట‌న చేయ‌గానే దాన్ని గేట్స్ ఖండించిన విష‌యం తెలిసిందే. 2018-19లో అమెరికా ఇచ్చిన 40 కోట్ల డాల‌ర్లు.. డ‌బ్ల్యూహెచ్‌వో బ‌డ్జెట్‌లో 15 శాతం క‌న్నా త‌క్కువే ఉన్న‌ది. నిధులు ఇస్తున్న‌వారిలో బ్రిట‌న్‌, ఐర్లాండ్‌, జ‌ర్మ‌నీ దేశాలు త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2018లో నిధుల రూపంలో డ‌బ్ల్యూహెచ్‌వోకు వ‌చ్చిన మొత్తం డ‌బ్బు 2160 మిలియ‌న్ల డాల‌ర్లు.  
logo