బుధవారం 27 జనవరి 2021
International - Jan 06, 2021 , 10:22:12

డ‌బ్ల్యూహెచ్‌వో బృందానికి.. చైనాలో నో ఎంట్రీ

డ‌బ్ల్యూహెచ్‌వో బృందానికి.. చైనాలో నో ఎంట్రీ

బీజింగ్‌:  చైనాలోని వుహాన్ న‌గ‌రంలో గ‌త ఏడాది తొలి సారి క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ‌హ‌మ్మారి ఇప్పుడు ప్ర‌పంచం అంతా పాకింది.  వుహాన్‌లోని ఓ మార్కెట్ నుంచి వైర‌స్ పాకింద‌ని.. ఆ న‌గ‌రంలో ఉన్న వైరాల‌జీ ల్యాబ్ నుంచి ప్రాణాంత‌క వైర‌స్ లీకైన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనాపై వ‌త్తిడి పెర‌గ‌డంతో.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆ దేశంలో విచార‌ణ చేప‌ట్టేందుకు సిద్ద‌మైంది. దీని కోసం గ‌త డిసెంబ‌ర్‌లో చైనా అనుమ‌తి కూడా తీసుకున్న‌ది. అయితే క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్లు తెలుసుకునేందుకు వుహాన్ వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించిన‌ డ‌బ్ల్యూహెచ్‌వో అధికారికి చేదు అనుభ‌వం ఎదురైంది.  ఆ అధికారిని చైనాలోకి రానివ్వ‌లేద‌ని తెలుస్తోంది.  వైర‌స్ గ‌ట్టు విప్పేందుకు డ‌బ్ల్యూహెచ్‌వోకు చెందిన ఇద్ద‌రు స‌భ్యులు వుహాన్ న‌గ‌రాన్ని విజిట్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ఒక‌రికి మాత్రం చైనా అనుమ‌తి ద‌క్క‌లేదు. ఆ నిపుణుడికి వుహాన్‌కు వెళ్లే మార్గం దొర‌క‌లేదు. మ‌‌రో అధికారి ట్రాన్సిట్‌లో మ‌రో దేశంలో ఉండిపోయిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో చెబుతున్న‌ది.  వీసా క్లియ‌రెన్సులు లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో  పేర్కొంటున్న‌ది.  

డ‌బ్ల్యూహెచ్‌వో సిబ్బందికి ప్ర‌వేశం క‌ల్పించ‌క‌పోవ‌డం ప‌ట్ల చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ స్పందించారు.  చైనా వైఖ‌రి నిరుత్సాహ‌ప‌రిచిన‌ట్లు ఆయ‌న అన్నారు. త‌మ స‌భ్యుల రాక గురించి చైనా అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.  డ‌బ్ల్యూహెచ్‌వో బృందం రాక కోసం అంత‌ర్గ‌త ప‌ద్ధ‌తుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌ని చైనా చెప్పిన‌ట్లు టెడ్రోస్ తెలిపారు. కానీ అందుకు భిన్నంగా చైనా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  జెనీవాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఈ మిష‌న్ డ‌బ్ల్యూహెచ్‌వో అత్యంత కీల‌క‌మైంద‌ని, అంత‌ర్జాతీయ బృందానికి కూడా ఇది ముఖ్య‌మ‌న్నారు. జంతు ఆహారం తిన‌డం వ‌ల్ల వుహాన్‌లో క‌ర‌నా వైర‌స్ ప్ర‌బ‌లిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే వాటిని తేల్చేందుకు డ‌బ్ల్యూహెచ్‌వో సుమారు ప‌ది మంది అంత‌ర్జాతీయ స్థాయి నిపుణుల‌ స‌భ్యుల‌ను చైనాకు పంపాల‌నుకున్నారు.  


logo