బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 16:30:57

డబ్ల్యూహెచ్‌ఓ వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలుపంచుకోమన్న అమెరికా

డబ్ల్యూహెచ్‌ఓ వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలుపంచుకోమన్న అమెరికా

జెనీవా : కరోనా వ్యాక్సిన్.. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆలోచనలు, వివాదాలు, విభేదాలకు ఆజ్యం పోస్తున్నది. డబ్ల్యూహెచ్‌ఓ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో 172 దేశాలు పాలుపంచుకొంటుండగా.. తమకు అవసరం లేదని చెప్తున్నది అమెరికా. 

'ఐరోపాలో జాతీయ స్థాయి లాక్డౌన్ అవసరమని అనుకోవడంలేదు. టీకా లేకుండా యూరప్ కరోనాతో జీవించగలదు. అంటువ్యాధిని కూడా ఓడించవచ్చు. అయితే అందుకు స్థానికంగా లాక్డౌన్ చేయవలసి ఉంటుంది. అంటువ్యాధితో జీవించడం నేర్చుకున్నప్పుడే మనం దీన్ని నివారించగలుగుతాం' అని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లగ్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వైరస్ తో పోరాడుతున్న అమెరికా.. కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనటానికి ఏ అంతర్జాతీయ కార్యక్రమంలోనూ పాల్గొనబోమని తేల్చిచెప్పింది. ఇప్పటివరకు అమెరికాలో 62.72 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 1.85 లక్షల మంది మరణించారు. డబ్ల్యూహెచ్‌ఓ ఉన్న కారణంగా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాల్గొనమంటోంది అమెరికా. 

డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని 172 దేశాల చొరవలో అమెరికా చేరదని వైట్ హౌస్ ప్రతినిధి జుడ్ డీర్ తెలిపారు. అంటువ్యాధిని ఓడించడానికి అమెరికా తన అంతర్జాతీయ మిత్రదేశాలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుందని, కానీ చైనా ప్రభావిత సంస్థ అవినీతిపరులైన డబ్ల్యూహెచ్‌ఓ ఒత్తిడిలోకి రామని కరాఖండిగా చెప్పారు. చైనాతో చేతులు కలిపి కరోనాకు సంబంధించిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ దాచిపెట్టిందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా 36 టీకాలు మానవులపై పరీక్షలు జరుపగా, 90 ప్రస్తుతం ప్రీ-క్లినికల్ ట్రయల్స్ కింద జంతువులపై ప్రభావాల కోసం పరీక్షించబడుతున్నాయి. ఈ ప్రధాన వ్యాక్సిన్లలో భారత్ కు చెందినవి కూడా కొన్ని ఉన్నాయి.

క్షమాపణలు చెప్పి సింగపూర్ ప్రధాని

మరోవైపు, అంటువ్యాధిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేసిన తప్పులకు సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సేన్ లూంగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 20 మంది కార్మికులను ఒకే గదిలో ఉంచినప్పుడు వలస కార్మికుల విషయంలో తప్పు జరిగిందని, ప్రభుత్వం మరింత త్వరగా, దూకుడుగా వ్యవహరించాల్సి ఉన్నదని ప్రధాని అన్నారు. సింగపూర్‌లో 56,901 కేసులు నమోదు కాగా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo