శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 01:59:59

శ్వేతసౌధాధిపతి ఎవరో?

శ్వేతసౌధాధిపతి ఎవరో?

  • చివరి అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • సుడిగాలి పర్యటనలు చేస్తున్న ట్రంప్‌, బిడెన్‌
  • పరస్పరం వాడీవేడీ విమర్శలు
  • ఇప్పటికే 8.1 కోట్ల మంది  ముందస్తు ఓటింగ్‌

వాషింగ్టన్‌, అక్టోబర్‌  31: అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరింది. శ్వేతసౌధంలో కొలువుదీరేదెవరో మరో మూడు రోజుల్లో ఓటర్లు తీర్పుచెప్పనున్నారు. మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే 8.1 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కీలకమైన రాష్ర్టాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గద్దెనెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ అధ్యక్ష పీఠంపై ఆసీనులయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 

జోరుగా క్యాంపెయిన్‌..

డెమోక్రాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న మిన్నెసొటా, మిషిగన్‌, విస్కాన్సిన్‌ రాష్ర్టాల్లో ట్రంప్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ర్టాల్లో మూడు దశాబ్దాల తర్వాత ఈసారి తమ జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ట్రంప్‌కు మద్దతుగా ఆయన కుమార్తెలు ఇవాంక, టిఫానీ, కుమారులు ఎరిక్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌లు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, డెమోక్రాట్‌ అభ్యర్థి జో బిడెన్‌ ఆరిజోనాలో పర్యటించగా, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌ రిపబ్లికన్ల కంచుకోట అయిన టెక్సాస్‌లో ప్రచారం నిర్వహించారు.  

ఒకవైపు బాధ్యతాయుత ప్రచారం.. మరోవైపు భారీ ప్రచారం

బిడెన్‌ శిబిరం ప్రధానంగా వర్చువల్‌ మాధ్యమంలోనే ప్రచారం నిర్వహిస్తున్నది. కరోనా విజృంభణ నేపథ్యంలో ‘డ్రైవ్‌ ఇన్‌ కార్‌' సభలకే (మద్దతుదారులు కార్లలోనే కూర్చొని ప్రసంగాలు వింటారు) ప్రచారాన్ని పరిమితం చేసింది. సభలకు కూడా తక్కువ మంది హాజరయ్యేలా చూసుకుంటున్నది. తద్వారా తమది బాధ్యతాయుతమైన ప్రచారం అని చెప్పుకుంటున్నది. భారీ సభలను నిర్వహించడం ద్వారా ట్రంప్‌ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని విమర్శిస్తున్నది. అయితే ట్రంప్‌ వర్గం మాత్రం డెమోక్రాట్ల సభలకు ప్రజలు రావడం లేదని, ప్రజలు వారిపట్ల వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నది. ట్రంప్‌ నిర్వహించే సభలకు 15,000 నుంచి 25 వేల మంది హాజరవుతున్నారు. వచ్చే రెండు రోజులపాటు ఆయన వివిధ రాష్ర్టాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మరోవైపు, బిడెన్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

2000 నాటి పరిస్థితి పునరావృతమయ్యేనా?

అమెరికా అధ్యక్ష  ఎన్నికల ఫలితాల్లో బ్యాలెట్ల సంఖ్యలో స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లయితే, అధ్యక్ష పీఠం ఎవరిదో నిర్ణయించే అంశం సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. ఇదే జరిగితే తనకు కలిసివస్తుందని ట్రంప్‌ ఆశిస్తున్నారు. ట్రంప్‌ ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమీ కోనీని నియమించడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆమె నియామకంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యలో రిపబ్లికన్‌-డెమోక్రాట్ల బలం 6:3కు చేరింది. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా విషయంలో ‘బుష్‌ వర్సెస్‌ గోర్‌' వివాదం రేగడంతో.. సుప్రీంకోర్టు సానుకూల వైఖరితో బుష్‌ అధ్యక్షుడయ్యారు.

అమెరికా ఎన్నికల బరిలో తెలుగింటి ఆడపడచు

హైదరాబాద్‌: తెలుగింటి ఆడపడచు అనంతాత్ముల మంగకు అమెరికాలో అరుదైన అవకాశం లభించింది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆమె అమెరికా ఎన్నికల బరిలో నిలిచారు.  విజయవాడకు చెందిన మంగ వర్జీనియాలోని 11వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు పోటీచేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్న మొట్టమొదటి భారత సంతతి మహిళ మంగనే కావడం విశేషం. ఆరుసార్లు కాంగ్రెస్‌ సభ్యుడిగా గెలిచిన జెర్రీ కొన్నొల్లీతో ఆమె తలపడుతున్నారు. 

వలస ప్రజల మద్దతు బిడెన్‌కే!

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న తరుణంలో వెలువడుతున్న సర్వే ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చినవారిలో మెజారిటీ ఓటర్లు బిడెన్‌వైపే మొగ్గు చూపుతున్నట్టు ‘2020 కోఆపరేటివ్‌ ఎలక్షన్‌ స్టడీ’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  ఆసియా ఖండం నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారిలో 65% మంది బిడెన్‌కు మద్దతిస్తుండగా కేవలం 28% మంది మాత్రమే ట్రంప్‌ వైపు ఉన్నట్టు సర్వే పేర్కొన్నది. సర్వేలో పాల్గొన్నవారిలో 51% మంది బిడెన్‌వైపు మొగ్గు చూపగా, 43% మంది ట్రంప్‌నకు మద్దతు పలికినట్టు తెలిపింది. దాదాపుగా నల్లజాతీయులంతా(86% మంది) ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్నట్టు తెలిపింది.