శనివారం 06 జూన్ 2020
International - May 08, 2020 , 02:28:53

వలంటీర్లే.. దారి చూపాలి

వలంటీర్లే..  దారి చూపాలి

  • క్లిష్టమైన అధ్యయనాలు జరుగాలి
  • అప్పుడే వ్యాక్సిన్‌ పరిశోధనలు వేగవంతం అవుతాయి
  • డబ్ల్యూహెచ్‌వో వర్కింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడి

న్యూయార్క్‌: కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వైరస్‌ వ్యాక్సిన్‌పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔషధ పరీక్షల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఆరోగ్యవంతులైన వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను సంక్రమింప చేయడం ద్వారా వ్యాక్సిన్‌ పరిశోధనలు వేగవంతమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఇలాంటి క్లిష్టమైన అధ్యయనాలు జరుగాలని ఆ సంస్థ వర్కింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది. అయితే వీటివల్ల తలెత్తే ప్రమాదకార పరిణామాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు జాగ్రత్తలు వహించాలని సూచించింది. క్లిష్ణ అధ్యయనాల కోసం శాస్త్రీయ సమర్థన, ఒనగూరే ప్రయోజనాలపై అంచనా, పరిశోధనపై పూర్తి సమాచారం లభ్యత వంటి ఎనిమిది నియమాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. కాగా, సాధారణంగా  కరోనా రోగులపై జరిగే పరిశోధనల వల్ల వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు చాలా కాలం పడుతుందని, క్లిష్ట అధ్యయనాల వల్ల ఇది త్వరగా సాధ్యమవుతుందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎపిడెమియాలజిస్ట్‌ మార్క్‌ లిప్‌పిచ్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం తమ జర్నల్‌లో పేర్కొంది. అయితే దీనివల్ల వలంటీర్లు, శాస్త్రవేత్తల ప్రాణాలకు ముప్పు ఎక్కువని హెచ్చరించింది. మరోవైపు క్లిష్ణ అధ్యయనాలు నేరమని, వీటివల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందున్న మోడర్నా ఇంక్‌ ప్రధాన వైద్యాధికారి టాల్‌ జాక్స్‌ పేర్కొన్నారు. కాగా, కరోనా ఔషధ పరీక్షల్లో స్వచ్ఛందగా పాల్గొనేందుకు 102 దేశాలకు చెందిన సుమారు 14,000 మంది వలంటీర్లు తమ పేర్లను ఫౌండేషన్‌ 1డే సూనర్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారు.


రోజుకు సగటున 80 వేల కరోనా కేసులు

ఏప్రిల్‌ నుంచి సగటున రోజుకు 80 వేల కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ బుధవారం జెనీవాలో తెలిపారు. ఐరోపా, పశ్చిమ దేశాల్లో వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నదని, మరోవైపు భారత్‌, బంగ్లాదేశ్‌, రష్యా వంటి ఈశాన్య ఆసియా, ఆఫ్రికా, పశ్చిమ ఐరోపా, తూర్పు మధ్యధరా దేశాల్లో కేసుల తీవ్రత పెరుగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతంలో వైరస్‌ నియంత్రణలో ఉన్నదో చెప్పడం కష్టమన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు వైపు మొగ్గుతున్న దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకోనిపక్షంలో మరింత తీవ్రమైన వైరస్‌ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


logo