బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 01, 2020 , 03:12:40

ప్రపంచానికి ముప్పు!

ప్రపంచానికి ముప్పు!
  • కరోనా నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ
  • ప్రపంచదేశాలు బాధ్యతగా వ్యవహరించాలి:చైనా.. 213కు చేరిన మృతులు
  • ఎయిరిండియా విమానంలో వూహాన్ నుంచి బయలుదేరిన భారతీయులు

జెనీవా, జనవరి 31: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. అసాధారణ పరిస్థితులు తలెత్తి ప్రపంచదేశాలకు ముప్పుగా మారినప్పుడు అంతర్జాతీయ సహకారం, సమన్వయం కోసం డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ శుక్రవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. చైనాలోని పరిస్థితులనే కాకుండా ఈ వైరస్‌ను ఎదుర్కోలేని బలహీన వైద్య వ్యవస్థలను కలిగిన దేశాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు చెప్పారు. వైరస్‌ను నియంత్రించే విషయంలో చైనా సామర్థ్యాలపై తమకు విశ్వాసం ఉన్నదన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు చైనాకు సర్వీసులను నిలిపివేయడం, స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్ వంటి సంస్థలు వందలాది షాపులను మూసివేయడంపై టెడ్రోస్ స్పందిస్తూ.. ప్రయాణాలు, వాణిజ్యంపై పరిమితులు సరికాదన్నారు. 

అతిగా స్పందించడం తగదు: చైనా

కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. ప్రపంచ దేశాలు బాధ్యతగా వ్యహరించాలని సూచించింది. అతిగా స్పందించడం మానుకోవాలని, దీని వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారంనాటికి 213కు చేరుకున్నది. మరో 9,692 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంగోలియా, సింగపూర్.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఇటలీలో ఇద్దరికి వైరస్ సోకడంతో ఆ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాగా, బ్రిటన్‌లోనూ ఇద్దరికి వైరస్ సోకింది.

భారతీయుల తరలింపు ప్రారంభం

చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఎయిరిండియా విమానం శుక్రవారం రాత్రి వుహాన్‌కు చేరుకున్నది. ఇందులో రామ్ మనోహర్ లోహియా దవాఖానకు చెందిన ఐదుగురు వైద్య నిపుణులు కూడా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మొదటి బ్యాచ్‌లో సుమారు 400 మందితో విమానం శనివారం తెల్లవారు జామున తిరుగుప్రయాణమైంది. మధ్యా హ్నానికి భారత్‌కు చేరుకోనున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం మరో విమానం వుహాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నదన్నారు. చైనా నుంచి వచ్చేవారి కోసం సైన్యం ఢిల్లీ సమీపంలో ప్రత్యేక వైద్యవసతిని ఏర్పాటుచేసింది. 

చచ్చినా పట్టించుకోలేదు

చైనావాసులను కరోనా వైరస్ ఎంత భయపెడుతున్నదో తెలిపేందుకు ఈ చిత్రమే ప్రత్యక్ష ఉదాహరణ. గురువారం ఉదయం వూహాన్ నగరంలోని దవాఖానకు సమీపంలోఫుట్‌పాత్‌పై ఒక వృద్ధుడు  సృహతప్పి పడిపోయాడు. కాసేపటికి ప్రాణాలు విడిచాడు. అతడు కరోనా వైరస్ వల్లే మరణించాడనే అనుమానంతో స్థానికులెవరూ దగ్గరికి వెళ్లలేదు. చివరికి వైద్యసిబ్బంది మాస్కులతో వచ్చి మృతదేహాన్ని తరలించారు. అయితే మృతికి గల కారణాలను వెల్లడించలేదు. 


logo