శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 23, 2020 , 11:49:26

కరోనా .. తుమ్ కబ్ జావోగే?

కరోనా .. తుమ్ కబ్ జావోగే?

హైదరాబాద్: కరోనా ఎప్పుడు పోతుంది? అసలింతకూ పోతుందా? లేదా? ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్తే ప్రపంచం బ్రహ్మరథం పట్టడం ఖాయం. కరోనా అచ్చంగా బ్రహ్మపదార్థంలా తయారైంది. అది జీవి కాదు.. జీవం లేని పదార్థం కాదు. అదేదో పురాణాల్లో చెప్పినట్టు వరాలు పొందిన రాక్షసుని తరహా అన్నమాట. అసలు అది నిన్నో, మొన్నో వచ్చిందైతే కదా రేపోమాపో పోతుందనడానికి. అనాదిగా ఉన్నవి వైరస్‌లే. మానవుడు వాటి ముందు ఓ బచ్చా. మరి విమోచన లేదా? అంటే ఉంది. వ్యాక్సిన్ లేదా టీకా అనేది వస్తే.. అది భూమ్మీద ఉన్న ప్రతి మనిషికీ ఇస్తే అప్పుడు విముక్తి. మరి అప్పటిదాకా ఏమిటి? అంటే చేతులు కడుక్కోవడం, మనిషి నుంచి మనిషి దూరందూరంగా మసలుకోవడం. ఆక్స్‌ఫర్డ్ వాళ్లు టీకా దాదాపు కనిపెట్టేసినట్టే అంటున్నారు. మరి ఆ టీకా సూదిమొన మీదకు ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తేలలేదు. అలా టీకా అంచున ఉన్న బ్రిటన్ వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? వారి చీఫ్ మెడికల్ ఆఫీసర్.. అంటే బ్రిటన్ సర్వోన్నత వైద్యాధికారి ప్రొఫెసర్ క్రిస్ విట్టీ మరో ఏడాదిదాకా ఈ కరోనా కట్టుబాట్లు కొనసాగించక తప్పదని తేల్చిచెప్పారు. ఈ కట్టుబాట్లను ఆయన అతలాకుతలం చేసే చర్యలు అని అభివర్ణించారు. అంటే బెరుకుబెరుకుగా, బెదురుబెదురుగా గడిపేయడం అన్నమాట. ఇదిగోతుమ్ము అంటే అదిగో వైరస్ అన్నట్టు బతకడం ఇప్పట్లో తప్పేలా లేదు. ప్రజలకు ఉన్న సంగతి తెలియజెప్పడం మంచిదని మరోమాట కూడా ఆయన చెప్పేశారు. అంటే ఇదంతా బుడ్డ పరాషికాలు కాదని ఆయన ఉద్దేశం. ఆకాంక్షలకు, వాస్తవానికి మధ్య సయోధ్య సాధించాలని మంత్రులకు విట్టీ సూచించారు. మొత్తంమీద నియంత్రణలు ఎలా పోతాయనేది ఆయన అరటిపండు వొలిచినట్టు చెప్పారు. కరోనాకు టీకా అనేది వచ్చేంతవరకు సామాజిక దూరాల కట్టుబాట్లు తగినపాళ్లలో ఎలా మేళవించాలి అనేది మంత్రులు నిర్ణయించుకోవాల్సి ఉందని బ్రిటన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ విట్టీ కుండ బద్దలు కొట్టారు.  


logo