గురువారం 25 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 01:52:17

వెనక్కు తగ్గిన వాట్సాప్‌

వెనక్కు తగ్గిన వాట్సాప్‌

  • కొత్త ప్రైవసీ పాలసీ గడువు మే 15కు పెంపు
  • ‘వాట్సాప్‌ బిజినెస్‌' కోసమే కొత్త అప్‌డేట్స్‌
  • యూజర్ల అనుమానాలన్నీ నివృత్తి చేస్తాం
  • ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు రద్దు కావు
  • తమ బ్లాగులో వెల్లడించిన వాట్సాప్‌

న్యూఢిల్లీ, జనవరి 16: కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్‌ వెనక్కు తగ్గింది. సమాచార గోప్యత, భద్రతపై తమ కొత్త పాలసీని ఆమోదించడానికి గడువును మే 15వ తేదీకి పొడిగించింది. ఈ పాలసీపై వదంతులు ప్రచారంలో ఉన్నాయని, అందువల్లే వినియోగదారుల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నది. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తమ బ్లాగులో తెలిపింది. వినియోగదారుల కాంటాక్ట్స్‌, లొకేషన్‌, సందేశాలు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్‌బుక్‌తో పంచుకోబోమని స్పష్టం చేసింది. కొత్త పాలసీలోని అంశాలు వాట్సాప్‌లో బిజినెస్‌ చేసేవారిని దృష్టిలో పెట్టుకొని చేర్చినవని, వారికి ఈ పాలసీ వల్ల మరిన్ని అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నది. ఫిబ్రవరి 8లోగా కొత్త పాలసీని ఆమోదించని వాట్సాప్‌ వినియోగదారుల ఖాతాలు రద్దు అవుతాయని కంపెనీ గతంలో ప్రకటించింది. దీనిపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌, తదితర అనుబంధ సంస్థలతో పంచుకోవడం ఏమిటంటూ లక్షల మంది వాట్సాప్‌ వినియోగదారులు వేరే మెసేజింగ్‌ యాప్‌లను ఎంచుకొన్నారు. ప్రత్యామ్నాయాలైన టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ల వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ నష్ట నివారణ చర్యలకు దిగింది. కొత్త పాలసీలోని అంశాలు వాడాలా.. వద్దా.. అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని వెల్లడించింది. ‘ఫిబ్రవరి 8వ తేదీన ఎవరి వాట్సాప్‌ ఖాతాలు రద్దు కావు. ఆమోదానికి సంబంధించి ఒకే ఆప్షన్‌ ఉండటంపై పునఃసమీక్ష నిర్వహిస్తాం’ అని బ్లాగులో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, వాట్సాప్‌ తన కొత్త ప్రైవసీ పాలసీని పూర్తిగా ఉపసంహరించుకొనేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. తాజా పాలసీ దేశభద్రతకు ముప్పని పేర్కొంటూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(కాన్ఫెడెరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌) కోర్టులో పిటిషన్‌ వేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, పెద్ద పెద్ద సాంకేతిక కంపెనీల నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. 

VIDEOS

logo