బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 09:30:36

ఐసీయూలో ప్ర‌ధాని.. మ‌రి ఇంచార్జ్ ఏం చేయాలి ?

ఐసీయూలో ప్ర‌ధాని.. మ‌రి ఇంచార్జ్ ఏం చేయాలి ?

హైద‌రాబాద్‌: ఇదో విచిత్ర ప‌రిస్థితి. బ‌హుశా రాజ్యాంగంలో ఇలాంటి సంఘ‌ట‌న గురించి ప్ర‌స్తావ‌న‌ ఉండ‌ద‌నుకుంటా. నోవెల్ క‌రోనా వైర‌స్ సోకిన‌ బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ప్ర‌స్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న త‌న బాధ్య‌త‌ల‌ను ఆ దేశ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్‌ డామినిక్ రాబ్‌కు అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు డిప్యూటీగా చేయాల‌ని డామినిక్‌ను బోరిస్ కోరారు. ప‌రిపాల‌నా సామ‌ర్థ్యాన్ని ప్ర‌ధాని కోల్పోయిన‌ప్పుడు ఇంచార్జ్ ఎలా దేశాన్ని న‌డిపిస్తారు. ఈ అంశాల‌ను ఓ సారి తెలుసుకుందాం.

నిజానికి ఇలాంటి పరిస్థితి సంభ‌విస్తే ఏం చేయాల‌న్న‌ది అస్ప‌ష్టంగానే ఉన్న‌ది. బ్రిట‌న్ రాజ్యాంగంలో దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. కాక‌పోతే ప్ర‌భుత్వ ప‌రిపాలన సాగించేందుకు కొన్ని ప‌ద్ధ‌తులు ఉన్నాయి. క్యాబినెట్ మాన్యువ‌ల్‌ను పాటించాల్సి ఉంటుంది. ఒక‌వేళ జాన్స‌న్ ఈ స్థితిలో ప‌రిపాల‌న చేయ‌లేన‌ని చేతులెత్తేస్తే, అప్పుడు డామినిక్ రాబ్ ప్ర‌భుత్వాన్ని త‌న కంట్రోల్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.  వాస్త‌వానికి కొన్ని నిర్ణ‌యాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఇంచార్జ్ పీఎం రాబ్‌.. సీనియ‌ర్ జ్యూడిసియ‌రి నియామ‌కాల గురించి బ్రిట‌న్ రాణికి ప్ర‌తిపాద‌న‌లు చేయ‌వ‌చ్చు. ఇలాంటి హైర్యాంక్ ప‌ద‌వుల గురించి ఆయ‌న రాణికి స‌ల‌హాలు ఇవ్వొవ‌చ్చు. కానీ పూర్తిగా స్థాన‌చ‌ల‌నం చేయ‌డం కుద‌ర‌దు. 

కానీ క్యాబినెట్‌తో సంప్ర‌దించిన త‌ర్వాత ఇంచార్జ్ పీఎం కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ సైనిక చ‌ర్య తీసుకోవాల్సిన‌ విప‌త్క‌ర ప‌రిస్థితి వ‌స్తే, అప్పుడు ఆయ‌న క‌చ్చితంగా క్యాబినెట్ అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఒక‌వేళ ప్ర‌ధానుల‌పై దాడి జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ప్పుడు, అప్పుడు న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్లకు సంబంధించిన ఆదేశాలు ఎలా ఉంటాయ‌న్న దానిపై ఆ పీఎం రాసిన లేఖ ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతుంది. 

ప్ర‌స్తుతానికి ప్ర‌ధాని జాన్స‌న్ ఐసీయూలోనే ఉన్నా.. ఆయ‌న ఆదేశాలు ఇవ్వ‌గ‌ల స్థితిలోనే ఉన్నారు. కానీ ఆయ‌న ప్ర‌ధానిగా త‌ప్పుకుంటే త‌ప్ప అన్ని కీల‌క నిర్ణ‌యాలు ఇంచార్జ్ పీఎంకు ట్రాన్స‌ఫ‌ర్ కావు.  ఒక‌వేళ ప్ర‌ధాని ప్రాణాలు కోల్పోతే, ఆ స‌మ‌యంలో ఇంచార్జ్ పీఎంను ప్ర‌ధానిగా చేయాల‌ని బ్రిట‌న్ రాణిని క్యాబినెట్ కోరే అవ‌కాశం ఉంటుంది. క‌నీసం తాత్కాలిక ప‌ద్ధ‌తిలోనైనా ఈ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. అయితే ఇప్పుడే ఈ స్థితి మ‌నం ఊహించ‌లేము. కానీ విశ్లేష‌కులు వివ‌ర‌ణ‌లు ఇలా ఉన్నాయి. జాన్స‌న్‌ది కాన‌ర్జ్వేటివ్ పార్టీ. ఆ పార్టీ కొత్త నేత‌ను ఎన్నుకునే వ‌ర‌కు  ప‌రిస్థితుల్లో మార్పు ఉండ‌దు.  నిజానికి ప్ర‌ధాని రాజీనామా చేసే వ‌ర‌కు కానీ, ఆయ‌న ప్రాణాలు కోల్పోయే వ‌ర‌కు కానీ.. అధికారాల‌న్నీ ఆ ప్ర‌ధాని ఆధీనంలోనే ఉంటాయ‌ని ప్రభుత్వ సీనియ‌ర్లు అంటున్నారు.  వాస్త‌వానికి రాజ‌కీయ పార్టీలు.. యాక్టింగ్ లీడ‌ర్ల‌ను నియ‌మిస్తాయి. కానీ యాక్టింగ్ ప్ర‌ధానులు అంటూ ఉండ‌ర‌ని నిపుణులంటున్నారు.
logo