బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 23:00:46

ఇన్‌ఫ్లుయెంజా తగ్గింది.. కారణమేంటో తెలుసా?

ఇన్‌ఫ్లుయెంజా తగ్గింది.. కారణమేంటో తెలుసా?

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లుయెంజా అనేది ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వల్ల వస్తుంది. దీన్ని ఫ్లూ అని కూడా పిలుస్తారు. దీనివల్ల జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అలసట, గొంతు, ముక్కు, కండరాల నొప్పి ఉంటుంది. కొవిడ్‌-19 కొన్ని లక్షణాలు దీంతో సమానంగా ఉంటాయి. కొన్నిసార్లు ఫ్లూ అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయితే, కొవిడ్‌ విజృంభణ మొదలైనప్పటినుంచి ఈ ఫ్లూ కాస్త శాంతించింది.  

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సీడీసీ) ఇటీవలి మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్లీ రిపోర్ట్ (ఎంఎమ్‌డబ్ల్యూఆర్) ప్రకారం యూఎస్‌తోపాటు ప్రపంచంలోని చాలాదేశాల్లో ఇన్‌ఫ్లుయెంజా తగ్గుముఖం పట్టింది.  సార్స్‌ సీఓవీ-2 వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకున్న ఉపశమన చర్యల ఫలితంగా ఈ తగ్గుదల కనిపిస్తోందని సీడీసీ నిర్ధారించింది. యూఎస్‌లో ఇన్‌ఫ్లుయెంజా వల్ల  శ్వాసకోశ లక్షణాల శాతం 2.3 శాతానికి పడిపోయినట్లు గుర్తించింది.

క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (సీఐడీ) లో ప్రచురితమైన 2018 అధ్యయనం ప్రకారం, యూఎస్‌లోని అన్ని వయసులవారిలో ఇన్‌ఫ్లుయెంజా 3-11.3 శాతంమందికి వస్తుంది. అక్టోబర్ 2019, ఏప్రిల్ 2020 మధ్య 39 మిలియన్ల నుండి 56 మిలియన్ల మంది ఫ్లూ బారినపడ్డారు. 4,10,000 నుంచి 74,0,000 వరకు దీంతో బాధపడుతూ దవాఖానలో చేరారు. సుమారు 24,000-62,000 మంది మరణించారు.

కరోనా సమయంలో ఫ్లూ తగ్గడానికి కారణమిదే..

కరోనా సమయంలో ఫ్లూ తగ్గడానికి ప్రధాన కారణం సార్స్‌ సీఓవీ-2 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేనని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, ఉత్తారార్ధ గోళంలో అందరికీ ఇన్‌ఫ్లుయెంజా టీకాలు వేయడం మరో కారణంగా అనుకుంటున్నారు. దీంతోపాటు జలుబు, దగ్గు, జ్వరంలాంటి లక్షణాలున్నవారు కేవలం కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకుని, ఫ్లూ టెస్ట్‌లకు వెళ్లకపోవడం కూడా ఓ కారణమై ఉంటుందని చెబుతున్నారు. ఇవే కారణాలతో దక్షిణార్థ గోళంలో ఇన్‌ఫ్లుయెంజా సీజన్‌గా పరిగణించబడే జూన్-ఆగస్టు 2020 నెలల్లో ఆస్ట్రేలియా, చిలీ, దక్షిణాఫ్రికాలాంటి దేశాల్లో తక్కువస్థాయిలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది చరిత్రలోనే మొదటిసారని అంటున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo