శనివారం 06 జూన్ 2020
International - Apr 21, 2020 , 10:39:23

ఏమిటి ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌.. ట్రంప్ సంత‌కం వ‌ల‌స‌ల్ని ఆపేస్తుందా ?

ఏమిటి ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌.. ట్రంప్ సంత‌కం వ‌ల‌స‌ల్ని ఆపేస్తుందా ?

హైద‌రాబాద్‌: త‌మ దేశంలోకి వ‌ల‌స‌ల్ని నిలువ‌రించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ను జారీ చేస్తాన‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స్థానిక ఉద్యోగుల్ని కాపాడుకునేందుకు.. వ‌ల‌స దేశ‌స్థుల‌కు చెక్ పెట్టాల‌ని ట్రంప్ భావిస్తున్నారు. దీని కోసం అవ‌స‌ర‌మైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ కూడా జారీ చేస్తాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు.  ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది రాత‌పూర్వ‌క ఆదేశం. ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వానికి సంబంధించిన అధ్య‌క్షుడు ఇలాంటి ఆదేశాలు ఇస్తుంటారు. దీనికి ఉభ‌య‌స‌భ‌ల ఆమోదం అవ‌స‌రం లేదు. 

అమెరికా రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ -2 ప్ర‌కారం ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్స్ జారీ చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ ఆ ఆదేశాల‌పై ప్ర‌జామోదం లేకుంటే, అప్పుడు దాన్ని న్యాయ‌వ్య‌వ‌స్థ స‌మీక్షిస్తుంది.  ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ను నీరుగార్చేందుకు ఉభ‌య‌స‌భ‌లు(కాంగ్రెస్‌) కూడా ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకురావ‌చ్చు.  కానీ ఆ చ‌ట్టాన్ని కూడా దేశాధ్య‌క్షుడు త‌న వీటో ప‌వ‌ర్‌తో ర‌ద్దు చేసే వీలున్న‌ది. అయితే ఇలాంటి ఆదేశాల‌ను ఈ ఏడాది 20 వ‌ర‌కు జారీ చేశారు ట్రంప్. ఫెడ‌ర‌ల్ రిజిస్ట‌ర్ ప్ర‌కారం ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. 

మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కూడా త‌న ప‌ద‌వీకాలంలో ప‌లుమార్లు ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌ను వాడారు. కానీ ట్రంప్ మాత్రం అధికారం చేప‌ట్టిన వారం రోజుల్లోనే ఇలాంటి నాలుగు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.  ప్ర‌భుత్వ విధానంలో త‌మ మార్క్‌ను చూపించుకునేందుకు సాధార‌ణంగా అధ్య‌క్షులు ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తుంటారు. మాజీ అధ్య‌క్షుడు ఒబామా.. హెల్త్‌కేర్‌, గే రైట్స్ లాంటి కీల‌క ఆదేశాల‌పై సంత‌కం చేశారు. అప్పుడు రిప‌బ్లిక‌న్లు దాన్ని వ్య‌తిరేకించారు. 

సాధార‌ణంగా యుద్ధ స‌మ‌యాల్లో దేశంలో సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఇలాంటి ఆదేశాలు ఇస్తుంటారు. 1942లో అమెరికా అధ్య‌క్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేశారు. దాని వ‌ల్ల జ‌పాన్ బంధీల కోసం డిటెన్ష‌న్ సెంట‌ర్ల‌ను క్రియేట్ చేశారు. 1952లో హ్యారీ ట్రూమాన్ ఇచ్చిన ఆదేశంతో ఉక్కు ప‌రిశ్ర‌మ‌లు ప్ర‌భుత్వ ఆధీనంలోకి వ‌చ్చాయి. స‌మ్మెల‌ను అడ్డుకునేందుకు అధ్య‌క్షుడు ట్రూమాన్ ఆ ఆదేశాలు ఇచ్చారు.  

ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ త‌న 12 ఏళ్ల ప‌ద‌వీకాలంలో సుమారు 3721 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌ను జారీ చేశారు. బ‌రాక్ ఒబామా 279, జార్జ్ డ‌బ్ల్యూ బుష్ 291 ఆదేశాల‌పై సంత‌కం చేశారు.  1885-89చ 1893-97 మ‌ధ్య అధ్య‌క్షుడిగా చేసిన గ్రోవ‌ర్ క్లీవ్‌ల్యాండ్ స‌గ‌టున రోజుకు 28 ఆదేశాలు జారీ చేశారు.  ఒక‌వేళ ట్రంప్ తాత్కాలికంగా ఇమ్మిగ్రేష‌న్‌పై ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ జారీ చేసినా.. ఇక ల‌క్ష‌లాది మందికి అమెరికా అంద‌ని ద్రాక్ష‌గా మారే అవ‌కాశం ఉన్న‌ది.
logo