న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలుసు కదా. దీనిని కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఈ వ్యాక్సినే ఇప్పుడు దేశంలో కరోనా వ్యాక్సినేషన్లో కీలకపాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడీ ఆస్ట్రాజెనెకా తొలిసారి సౌతాఫ్రికాలో కనిపించిన బీటా వేరియంట్‌పై మరో బూస్టర్ డోసును అభివృద్ధి చేసి పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కొత్త వ్యాక్సిన్ ఏంటి? ఇంతకు ముందు వ్యాక్సిన్ కంటే ఇది ఎలా భిన్నం? వ్యాక్సిన్ మిక్సింగ్‌లో దీని పాత్ర ఏంటి? అన్న ఆసక్తికర అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొత్త వెర్షన్ ఏంటి?
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తొలిసారి గత డిసెంబర్లో యూకే ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత చాలా దేశాలు ఆ వ్యాక్సిన్‌ను అలాగే తమ దగ్గర కూడా అనుమతించాయి. అయితే అప్పటికి ఇప్పుడున్న వేరియంట్లలో చాలా వరకూ లేవు. దీంతో వ్యాక్సిన్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొత్త వేరియంట్లు ఈ వ్యాక్సిన్‌ను బోల్తా కొట్టించగలవన్న నిపుణుల వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి. అటు సౌతాఫ్రికా కూడా తమ వేరియంట్‌పై ఇది పనిచేయదంటూ ఆస్ట్రాజెనెకా డోసుల వినియోగానికి నో చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీటా వేరియంట్‌పై పనిచేసే మరో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని ఆస్ట్రాజెనెకా భావించింది.
ఇప్పుడున్న వ్యాక్సిన్‌కు, దీనికి తేడా ఏంటి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు క్లినికల్ పేరు ఏజెడ్‌డీ1222. దీనిని వైరల్ వెక్టార్ ప్లాట్‌ఫామ్‌పై తయారుచేశారు. అంటే ఓ హాని కలిగించని వైరస్‌ను ఈ వ్యాక్సిన్ తయారీ కోసం వినియోగించారు. ఇందులో చింపాజీల్లో కనిపించే ఎడినోవైరస్ను ఉపయోగించారు. వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను శరీరంలోకి పంపడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను భవిష్యత్తు దాడులకు సిద్ధంగా ఉండేలా ప్రేరేపిస్తుంది.
ఇక ఇప్పుడు ఆస్ట్రాజెనెకా పరీక్షిస్తున్న కొత్త వ్యాక్సిన్ క్లినికల్ పేరును ఏజెడ్‌డీ2816గా పిలుస్తున్నారు. దీనిని కూడా ఇప్పుడున్న వ్యాక్సిన్‌లాగే వెక్టార్ ప్లాట్‌ఫామ్‌పై అదే ఎడినోవైరల్ ఉపయోగించే తయారు చేశారు. అయితే శరీరంలోకి ప్రవేశపెట్టే స్పైక్ ప్రొటీన్ మాత్రం బీటా(బీ.1.351) వేరియంట్‌కు సంబంధించింది. ఈ మార్పులు స్వల్పమని, అయితే రెండు వ్యాక్సిన్లు దాదాపు ఒకటే అని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
ఇతర వేరియంట్లపైనా పని చేస్తుందా?
ఇప్పుడీ బీటా వేరియంట్‌పై పరీక్షిస్తున్న కొత్త వ్యాక్సిన్ ఇతర వేరియంట్లపైనా పని చేస్తుంది. ఎందుకంటే దీని స్పైక్ ప్రొటీన్‌లో 10 మార్పులు చేశారు. ఇవి ఇతర వేరియంట్లలోనూ కనిపించినవే. ఈ కొత్త వేరియంట్లలో కనిపించే స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలపై ప్రభావం చూపుతోంది. అందుకే గత వ్యాక్సిన్లు వీటిపై సమర్థంగా పని చేస్తాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అందుకే కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేసేలా ఈ కొత్త వెర్షన్ వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా పరీక్షిస్తోంది.
ఇది బూస్టర్ డోసా?
భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను ఎంత సమర్థంగా ఎదుర్కొంటామన్నదానిపైనే కరోనాపై విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రాజెనెకా ఆ లక్ష్యంతోనే ఈ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తోంది. ఆ లెక్కన భవిష్యత్ వేరియంట్లపై ఈ కొత్త వెర్షన్ బూస్టర్ డోస్‌లా పని చేస్తుందని చెప్పొచ్చు.
వైరస్ కొత్త వేరియంట్ల కంటే మనం కాస్త ముందు ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ కొత్త ఏజెడ్‌డీ2816 వెర్షన్ వ్యక్తుల రోగ నిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది. అందుకే ఈ వ్యాక్సిన్ రెండు/మూడు దశల ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఉన్నతాధికారి మీన్ పాంగాలోస్ చెప్పారు.ఈ ట్రయల్స్ డేటా ఈ ఏడాది చివరిలోగా రానుంది. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ వినియోగానికి సంస్థ అనుమతులు కోరనుంది.
వ్యాక్సిన్ మిక్సింగ్ సంగతేంటి?
ఈ ట్రయల్స్‌లో మొత్తం 2250 మంది పాల్గొంటున్నారు. యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్, పోలాండ్ దేశాల వాళ్లు ఇందులో ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే ఏజెడ్‌డీ1222 లేదా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లూ ఉన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని మూడు నెలలు గడిచిన వాళ్లను తీసుకున్నారు. ఆ లెక్కన ఈ ప్రయోగాలు వ్యాక్సిన్ మిక్సింగ్‌కు సంబంధించి కూడా ముందడుగు వేసినట్లే. ఇప్పటికే పలు యురోపియన్ దేశాలు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ చేస్తున్నాయి.
ప్రపంచంలో చాలా దేశాలు వినియోగిస్తున్న ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు. వీటితో పోలిస్తే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భిన్నం. కానీ తాజా ప్రయోగాల్లో ఇవి వేసుకున్న వాళ్లను కూడా తీసుకుంటున్నారు. ఇక ఎలాగూ గతంలో ఆస్ట్రాజెనెకాకే చెందిన ఏజెడ్‌డీ1222 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లూ వీళ్లలో ఉన్నారు. ఆ లెక్కన వ్యాక్సిన్ మిక్సింగ్‌పై ప్రయోగాలు కూడా జరుగుతున్నట్లే. వ్యాక్సిన్ల కొరతకు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ పరిష్కారం కానుంది.