శుక్రవారం 14 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 08:49:09

గాలిలో వైర‌స్ నిజ‌మైతే.. డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చేస్తుంది ?

గాలిలో వైర‌స్ నిజ‌మైతే.. డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చేస్తుంది ?

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాపిస్తుంద‌న్న విషయాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. గాలిలో ఉన్న తుంప‌ర్ల‌ వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి చెందే ఆధారాలను ప‌రిశీలిస్తున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది.  జ‌నం ర‌ద్దీగా ఉన్నా, గాలి.. వెలుతురు స‌రిగా లేని ప్ర‌దేశాల్లో.. క‌రోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో అంగీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  ఒక‌వేళ వైర‌స్ గాలి ద్వారా సోకుతుంద‌ని తేలితే, అప్పుడు ఇన్‌డోర్ ప్ర‌దేశాల్లో పాటించాల్సి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో మార్చే అవ‌కాశాలు ఉన్నాయి. 

రెండు రోజుల క్రితం సుమారు 239 మంది శాస్త్ర‌వేత్త‌లు ఓ అధ్య‌య‌నాన్ని వెలువ‌డించారు.  వైర‌స్ గాలి ద్వారా వ్యాపిస్తుంద‌ని వారు ఓ ప‌త్రాన్ని డ‌బ్ల్యూహెచ్‌వోకు స‌మ‌ర్పించారు. కానీ క‌రోనా వైర‌స్ నోటి నుంచి వ‌చ్చే తుంప‌ర్ల ద్వారా మ‌నిషి నుంచి మ‌నిషికి సోకుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెబుతూ వ‌చ్చింది. అయితే త‌మ స్ట‌డీకి చెందిన రిపోర్ట్‌ను కొల‌రాడో యూనివ‌ర్సిటీ కెమిస్ట్ జోస్ జిమినేజ్ మీడియాతో వెల్ల‌డించారు.  ఇది డ‌బ్ల్యూహెచ్‌వోను అటాక్ చేయ‌డం కాదు, ఇది కేవ‌లం శాస్త్రీయ చ‌ర్చ మాత్ర‌మే అని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌న్న ఉద్దేశంతో బ‌హిర్గ‌తం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 

జ‌నం ర‌ద్దీగా ఉన్న చోట‌,  వెంటిలేష‌న్ స‌రిగా లేని ప్ర‌దేశాల్లో క‌రోనా వైర‌స్ గాలి ద్వారా వ్యాపిస్తుంద‌న్న విష‌యాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో టెక్నిక‌ల్ లీడ్ బెనిడెట్టా అలెగ్రాంజీ తెలిపారు.  తుమ్మినా.. ద‌గ్గినా.. మాట్లాడినా.. వ‌చ్చే తుంప‌ర్ల వ‌ల్ల వైర‌స్ సంక్ర‌మిస్తుంద‌న్నారు. అయితే ఆ తుంప‌ర్లు వాస్త‌వానికి ఎక్కువ సేపు గాలిలో ఉండ‌వు. ఏదో ఒక స్థానంలో ప‌డిపోతాయి. దాని కోసమే హ్యాండ్‌వాష్ అవ‌స‌ర‌మ‌ని గ‌తంలో డ‌బ్ల్యూహెచ్‌వో సూచించింది.  కానీ 239 మంది శాస్త్ర‌వేత్త‌లు త‌మ అధ్య‌యనంలో తుంప‌ర్లు.. గాలిలో ఎక్కువ సేపు ఉంటాయ‌న్నారు. మాట్లాడిన‌, శ్వాస పీల్చిన త‌ర్వాత కొన్ని గంట‌ల పాటు గాలిలోనే ఆ వైర‌స్ తుంప‌ర్లు ఉండే ప్ర‌మాదం ఉంద‌న్నారు.  

ప్ర‌స్తుతం ఈ అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ది. ఒక‌వేళ ఇది క‌న్ఫ‌ర్మ్ అయితే, అప్పుడు వైర‌స్‌ను నియంత్రించే అంశంలో సూచ‌న‌ల‌ను మార్పు చేయాల్సి ఉంటుంది.  మాస్క్‌ల వినియోగం మ‌రింత ఎక్కువ చేసే అవ‌కాశం ఉంటుంది.  సోష‌ల్ డిస్టాన్సింగ్ కూడా పెరుగుతుంది.  బార్లు, రెస్టారెంట్లు, ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ల్లో.. దూరం పెంచాల్సి వ‌స్తుంద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  logo