మంగళవారం 26 మే 2020
International - May 12, 2020 , 13:24:51

ఎన్‌ఆర్‌ఐ మిత్రులారా మీ గాథను మాకు పంపిస్తారు కదూ!

ఎన్‌ఆర్‌ఐ మిత్రులారా మీ గాథను మాకు పంపిస్తారు కదూ!

ప్రియ మిత్రుడా! 

నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే (తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) దిన పత్రికల తరఫున మీకు శుభాభినందనలు. 

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నది మన సంస్కృతి. మనం ఏ సుదూర తీరాలకు తరలిపోయినా... మన ‘నేల- తల్లి’ మనలను మరువదు. మన ‘నేల- తల్లి’ని మనమూ మరువం... మరువలేం! బతుకుతెరువు కోసం భౌతికంగా మనమెక్కడున్నా, తెలంగాణతో మన మనసు పెనవేసుకున్న బంధం ఏనాడూ తెగిపోనిది. ఎవరూ తెంచలేనిది. తల్లి వేరు కోసం తండ్లాట ఎన్నడూ ఆగదు కదా!

తెలంగాణ గడ్డపై పుట్టి పెరిగి.. ఇంట చదివి, రచ్చ ఎదిగి, నిలిచి గెలిచిన వారు ఎందరో! ప్రవాసంలో నివసిస్తూ కూడా జాతి ఖ్యాతి పతాకాన్ని ఎగరేసిన వారు ఇంకెందరో! మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజం గర్విస్తున్నది. మీరు వేస్తున్న ముందడుగులను చూసి మురిసిపోతున్నది. మీ సాఫల్యాలను చూసి సంబురపడుతున్నది. అనుకోని కష్టాలకు, అనేక నష్టాలకు ఎదురీది మీరు సాధించిన విజయం అనితరసాధ్యం. ఆదర్శప్రాయం!

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన స్వల్ప కాలంలోనే, సొంత అస్తిత్వంతో అసామాన్య విజయాలు సాధిస్తున్న తెలంగాణ& ఇప్పుడు, మీ విజయ పరంపరనూ వీక్షించాలనుకుంటున్నది. మీ గుండె చప్పుడును వినాలనుకుంటున్నది. మీ సఫలతను సగర్వంగా మాతో.. మా ద్వారా సబ్బండ వర్గాల తెలంగాణ సమాజంతో.. సోదర ప్రవాసీ స్వజనులతో  పంచుకోవాలని కోరుతున్నాం. మా కోసం మీరు అక్షర యాత్ర చేయాలని ఆహ్వానిస్తున్నాం. మీ విజయగాథను మాకు పంపండి. 

తెలంగాణలో మీ స్వస్థలమేది? ప్రస్తుతం నివసిస్తున్న దేశమేది.. ప్రదేశమేది? ప్రవాసానికి మీ ప్రయాణమెలా సాగింది? వృత్తిగతంగా ఉన్నత శిఖరాలను ఎలా ఎక్కగలిగారు? వ్యక్తిగతంగా అత్యున్నతంగా ఎలా నిలువగలిగారు? ఇప్పుడు మీ సొంత ఊరుతో మీకున్న సంబంధమేమిటి? మీరు చిన్నప్పుడు చదువుకున్న బడితో మీ అనుబంధం ఇంకెట్లా కొనసాగుతున్నది? అక్కడైనా ఇక్కడైనా మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? గతానికి, ఘనమైన వర్తమానానికి మధ్య సాగుతున్న మీ జీవన యాత్రను, మీ కుటుంబ విశేషాలను మాకు రాసి పంపించండి. ఇంగ్లిషులోనైనా సరే, తెలుగులోనైనా సరే! మీ ఫొటోలను, మీ కుటుంబం ఫొటోలను మంచి సైజులో అందించండి. 

మీ విజయ ప్రస్థానాన్ని మేం మా ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకుల చెంతకు చేరుస్తాం. మీ కథ మరికొందరికి ప్రేరణ అవుతుంది. మీ విజయ పథం మరో నలుగురు నడిచే బాట అవుతుంది. తెలంగాణ తల్లితో మీ బంధాన్ని యాది చేసుకునేందుకు మేమొక వేదిక అవుతాం. తెలంగాణ నేలతో మీ అనురాగం మరింత ఆత్మీయంగా కొనసాగేందుకు మేం సాధనమవుతాం. 

ఆసక్తికరమైన మీ గాథను మాకు పంపిస్తారు కదూ! మీ స్పందన కోసం వేచి చూస్తూ..   

మీ ప్రొఫైల్‌ను మాకు పంపాల్సిన మెయిల్‌ ఐడీ: [email protected] or [email protected]

ధన్యవాదాలతో..

తీగుళ్ల కృష్ణమూర్తి -ఎడిటర్‌ నమస్తే తెలంగాణ
logo